అమ్మో! ఎంత పేద్ద జిలేబీయో!!
ముంబై: స్వీటు ప్రియులకు సంతోషం కలిగించే వార్త ఇది. ప్రపంచంలోనే పెద్ద జిలేబీ మనదేశంలోనే తయారైంది. ముంబైలోని సంస్కృతి రెస్టారెంట్ భారీ జిలేబీ తయారు చేసింది. దీని బరువు అక్షరాల 18 కేజీలు. 9 అడుగుల వ్యాసార్థంతో దీన్ని రూపొందించారు. 12 మంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఇందుకోసం 1000 లీటర్ల పంచదార పాకం, 3500 కేజీల నెయ్యి వినియోగించారు. దీంతో 8.2 అడుగుల వ్యాస్థారంతో గతంలో రూపొందించిన జిలేబీ రికార్డు బద్దలైంది.
ఇదే బృందం 37 కిలోల జాంగ్రీ తయారు చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఈ రికార్డును స్వయంగా వీక్షించారు. భారీ స్వీట్లు తయారు చేసేందుకు 100 రోజుల పాటు రోజుకు 20 గంటల పాటు సాధన చేశామని సంస్కృతి రెస్టారెంట్ ముఖ్య వంటగాడు గౌరవ్ చతుర్వేది వెల్లడించారు.