అక్కడి అమ్మాయిలందరూ.. ఆమె దారిలోనే
మాల్దా: పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన 16 ఏళ్ల శాంతన మండల్ వద్ద ఇప్పట్లో ఎవరూ పెళ్లి ప్రతిపాదన చేసే సాహసం చేయబోరు. అంతేకాదు మాల్దా జిల్లాలో ఎంతో అమ్మాయిలు ఆమె బాటలోనే నడుస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని చెబుతున్న ఈ సరస్వతి పుత్రిక బాల్యవివాహాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం.. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.
శాంతనది పేద కుటుంబం. తల్లి ఓ ఇంట్లో పనిమనిషిగా, తండ్రి దినకూలీగా పనిచేస్తున్నారు. గత జనవరిలో శాంతన తల్లిదండ్రులు ఓ దినకూలితో ఆమెకు పెళ్లి నిర్ణయించారు. ఆ సమయంలో ఆమె మాధ్యమిక్ పరీక్షకు కష్టపడి చదువుతోంది. పెళ్లి విషయం తెలియగానే శాంతన తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడే పెళ్లి వద్దు, చదువుకుంటానని ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు ఆమె మాట వినలేదు. దీంతో చైల్డ్ లైన్‌కు ఫోన్ చేసి తన సమస్యను ఏకరువు పెట్టింది. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పెళ్లిని రద్దు చేయించారు. శాంతన చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
నాలుగు నెలలు తిరిగే సరికి శాంతన జీవితంలో వెలుగు వచ్చింది. ఆమె మాధ్యమిక్ పరీక్ష పాసయ్యింది. మాధ్యమిక్ సర్టిఫికెట్ చూసి గర్విస్తోంది. పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి లేకుంటే మరింత మెరుగైన మార్కులు తెచ్చుకునేదాన్ననని చెబుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించింది. కూతురి విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. మైనర్ కుమార్తెకు పెళ్లి చేయాలని భావించిన తమకు జిల్లా అధికారులు అవగాహన కల్పించారని, పెద్దలయిన తమకు తెలియని విషయాన్ని కుమార్తె నేర్పించిందని అన్నారు. శాంతన తమకు స్ఫూర్తిగా నిలిచిందని, ఎలా పోరాడాలో నేర్పిందని, బాల్యవివాహాలు చేసుకోబోమని అమ్మాయిలు చెబుతున్నారు.