ఎన్ మన్ సన్ అంటున్న ప్రభుదేవా
ప్రఖ్యాత నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించనున్న చిత్రానికి ఎన్ మన్ సన్ టైటిల్ను నిర్ణయించారు. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్న చిత్రం ఇదే. ప్రస్తుతం బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వంలో కాళిదాస్ జయరాం హీరోగా ఒరు పక్క కథై చిత్రాన్ని, సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళైక్కనుం చిత్రాలను నిర్మిస్తున్న వాసన్ విజువల్స్ వేంచర్ సంస్థ అధినేతలు కేఎస్.శ్రీనివాసన్, కేఎస్.శివరామన్ ప్రభుదేవా హీరోగా చిత్రం రూపొందించనున్నారు. ఇందులో దర్శకుడు తంగర్బచ్చన్ ఒక కీలక పాత్రను పోషించనున్నారట. ఆర్జే.బాలాజి, బాహుబలి ప్రభాకర్ కాళికేయన్, చిత్రాలక్ష్మణన్, కుంకీ అశ్విన్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రేష్ సంగీతాన్ని అందించనున్నారు.
హీరోయిన్, ఇతర సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్లో జరుగుతోంది. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్.అర్జున్ నిర్వహించనున్నారు. ఈయన ముండాసిపట్టి, ఇండ్రు నేట్రు నాళై చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఈ ఎన్ మన్ సన్ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.