అరుదైన మూలికలు@సంతబజార్
సాక్షి, మహబూబ్నగర్ : ఏదైన ఆయుర్వేదం వైద్యానికి కావాల్సిన మూలికలు, దినుసులు నాగర్కర్నూల్ సంత బజార్లో దొరుకుతాయి. చిరుధాన్యాల నుంచి ఆరుదుగా దొరికే అడవి గింజలు, ఆకులు, మూలికలు వరకు అన్ని ఒకే చోట లభ్యమవుతున్నాయి. ఆయర్వేదం వైద్యానికి అవసరమగు నేరేడు విత్తులు, నాగ కేశరములు, అడవి బాదామి, తిప్ప తీగ, తెల్లపట్టిక తదితర అన్నీ ఇక్కడే విక్రయిస్తుంటారు. దాదాపు వంద రకాల దినుసులు, చెట్ల వేర్లు, మూలికలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మన్ననూర్, హైదరాబాద్లోని బేగంబజార్, సికింద్రాబాద్, బెంగళూర్ వంటి దూర ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దశాబ్దాలుగా అనేక రకాలైన దినుసులు, మూలికలు, వేర్లు విక్రయిసున్నారు. అంతే కాకుండా పూజా సామగ్రి విరివిగా లభిస్తాయి. బంగారు విక్రయ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. దశాబ్దాలుగా బంగారు విక్రయాలకు నిలయంగా ఈ వీధి ఉంది.
అరుదుగా దొరికే కొన్ని రకాల మూలికలు
అక్రోట్ కాయలు, మాసి కాయలు, అడవి యాలకులు, నల్లవుసిరి, తిప్ప తీగ, నాగ కేసరములు, పట్టి వేరు, టానికాయలు, అడవి బుర్రెలు, అడవి చింత, కలబంధ, కటక రోహిణి, సకస్తూరి పసుపు, మాని పసుపు, నేల తాటి, నేల గుమ్మడి, ఎర్ర మద్ది, మర్రి ఊడలు, కురు వేరు, వజ కొమ్మలు, అతి వజ, ఆదొండ, దొండ పిండి, కంద చెక్కర, సూర్యనామ, సొంటి, కరక్కాయలు, వాయుకుంభాలు, గంటు భరంగి, ఆకుల కర్ర, సామ్రానీ జైపు, పిట్టకాయలు, సైదవ లవణం, తాటి బెల్లం, సపేదమెస్త్రీ, కర్జూర పండ్లు తదితర ఆయుర్వేదానికి సంబంధించి అడవి మూలికలు లభిస్తాయి.
దినుసులు
సారా పప్పు, అడవి జిలకర్ర, తోక మిరియాలు, అటుకు మామిడి పప్పు, ఎదురు బియ్యం, లవంగాల పట్ట, రాగి హంస, దులగొండి విత్తులు, నేరేడి విత్తులు, బాదం పప్పు, అడవి జిలకర్ర, ఆజా వాము, కుసుములు, కంది, పెసర, శనగ పప్పు గింజలు, ఆముదాలు, వడ్లు, చిల్ల గింజులతో పాటు చిరు ధాన్యాలు, వివిధ రకాల ఇతర పప్పుధాన్యాలు లభిస్తాయి.
గింజల నుంచి మూలికల నుంచి తీసిన నూనెలు
ఇప్ప నూనె, కానుగ నూనె, వేప నూనె, ఆవ, కుసుమ, నువ్వుల నూనెలు, ఆముదం నూనె, అల్వీన్ ఆయిల్ తదితర నూనెలు ఉన్నాయి.
నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం
వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైన పుప్పు ధాన్యాలు, మూలికలు, వేర్లు, ఆయుర్వేదంకు అవసరమయ్యే అనేక రకాల మొక్కలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాము. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రజలు వచ్చి తమకు అవసరం అయ్యే వాటినే కొంటారు. ఆన్లైన్లో కూడా మా దుకాణం సమాచారం వస్తుంది.
– బొడ్డు వెంకటప్రసాద్, వ్యాపారి, సంతబజార్, నాగర్కర్నూల్