మానవత్వం మిషెల్‌గా మారింది!
ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో నివసించే మిషెల్ ఖాజీం కామ్లె ఓ సాధారణ విద్యార్థిని. అయితేనేం... ఆమె చూపిన అసాధారణ సాహసం అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఇంతకీ ఆమె ఎవరు... ఆమె చేసిన సాహసం ఏమిటి?
డిసెంబర్ 14, శనివారం... పశ్చిమ కళ్యాణ్‌లోని సంతోషిమాతా రోడ్డుపై, సాయంత్రం ఆరింటప్పుడు రామ్‌బాగ్‌లో నివసించే డాక్టర్ మయూర్ మెహతా అనే వ్యక్తి స్కూటర్ మీద వెళుతూ 19 ఏళ్ల జయేష్ డోంగరే అనే యువకుడిని ఓవర్టేక్ చేశాడు. దాంతో వారి మధ్య మాటా మాటా పెరిగి జయేష్ తన వద్ద ఉన్న కత్తితో మయూర్‌పై దాడి చేశాడు. మయూర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ, పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో ఒక్కరూ ముందుకు రాలేదు. రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడుతున్న మయూర్‌ను ప్రేక్షకుల్లా చూడసాగారు.
మిషెల్ రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కాలేజ్ నుంచి ఆ దారిలో ఇంటికి వెళుతోంది, అయితే ఆమె ఈ సంఘటన చూసి చలించిపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, అతనికి ధైర్యం చెప్పింది. అక్కడ ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నవారిని అతణ్ణి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించమని కోరింది. కాని ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు అతని శరీరం నుంచి రక్తస్రావం ఆగడంలేదు. దీంతో తమ సంప్రదాయపు పరదాలను పక్కనబెట్టి, తన ముఖం మీద ఉన్న స్కార్ఫ్ తీసి, కత్తిపోటు కారణంగా రక్తస్రావం అవుతున్న చోట కట్టుకట్టింది.
రోడ్డుకు ఒకపక్కగా మయూర్‌ను పడుకోబెట్టి... అటుగా వెళుతున్న ఆటోలను ఆపింది. ఆటోవాళ్లు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రికి తీసుకుపోకుంటే కేసు పెడతానని బెదిరించడంతో చివరికి ఓ ఆటోవాలా అంగీకరించాడు. ఆగమేఘాల మీద అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడంతో చికిత్స పొందుతూ, కొద్దిసేపటిలోనే కన్నుమూశాడు మయూర్. ఎంత ప్రయత్నించినా సాటిమనిషి ప్రాణాలను కాపాడలేకపోయినందుకు మూగగా రోదించింది మిషెల్.
మిషెల్‌తోపాటు చొరవతో ముందుకు వచ్చిన మరో ముగ్గురు అందించిన వివరాల మేరకు నిందితుడిని రెండు రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అసాధారణ చొరవచూపి సాటి మనిషికి సహాయం చేసిన మిషెల్‌ను ఠాణే పోలీసులు సత్కరించారు. కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) కూడా ఆమెను ప్రతిభను గుర్తించి సత్కరించింది. ఆమెతోబాటు ... ఆమెకు సహకరించిన గులాం హుస్సేన్, అమోల్ జోషిలను కూడా సత్కరించారు. అయితే ఆమె సత్కారాలతో తనకు సంతృప్తి లభించదని, ఇటువంటి సంఘటనలను చూసినప్పుడైనా, ప్రేక్షకపాత్ర వహించకుండా మానవతాదృక్పథంతో స్పందించి, కష్టాలలో ఉన్న వారికి చేతనైన సాయం అందిస్తేనే అసలైన ఆనందం కలుగుతుందంటుంది.
ఈ బాధ్యత మనందరిదీ!
‘‘మానవత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ప్రాణం పోతే తిరిగిరాదన్న సంగతి అందరం గుర్తుంచుకోవాలి. మనవాళ్లు ప్రమాదంలో ఉంటే ఎలా వ్యవహరిస్తామో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడేందుకు కూడా అంత సిన్సియర్‌గా ప్రయత్నించాలి’’అంటున్న మిషెల్ మాటల్లో ఎంతో నిజం ఉంది.
- గుండారపు శ్రీనివాస్, ముంబై, సాక్షి
ఫొటోలు: పిట్ల రాము
గర్వించేలా చేసింది...
‘‘మా అమ్మాయి చేసిన సాహసం, ధైర్యం మా కుటుంబంలోని వారందరినీ గర్వించేలా చేసింది. మొన్నటివరకూ నన్ను ఎవరూ పట్టించుకోని వారు కూడా ఇవ్వాళ్ల నన్ను చూసి ‘అరుగో, ఆయనే మిషెల్ తండ్రి’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’’
- ఖాజీం కామ్లె, మిషెల్ తండ్రి
సంప్రదాయం కన్న ప్రాణమే మిన్న అనిపించింది
సాధారణంగా మా సంప్రదాయం ప్రకారం తలమీద ఉండే వస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. అయితే ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో అంతకంతకూ తీవ్రమవుతున్న రక్తస్రావాన్ని ఆపాలంటే నా తలమీద ఉండే వస్త్రాన్ని తొలగించడం మినహా మరో మార్గం కనిపించలేదు. సంప్రదాయాన్ని కాపాడుకోవడం కన్నా సాటి మనిషి ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని ఆ క్షణంలో నాకు అనిపించింది.
- మిషెల్