SAP Lab India
-
ఆగని ఉద్యోగాల కోత.. శాప్ ల్యాబ్స్ నుంచి 300 మంది అవుట్
SAP ల్యాబ్స్ భారతదేశ కేంద్రాలలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించింది. గ్లోబల్ డెలివరీ సెంటర్ మూసివేయడం వల్ల ఈ తొలగింపు జరిగిందని సంస్థ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది బెంగళూరు, గురుగ్రామ్ కార్యాలయాల్లో పనిచేసేవారు ఉండటం గమనార్హం. నివేదికల ప్రకారం, కంపెనీ తొలగించిన ఉద్యోగులలో దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. రిట్రెంచ్‌మెంట్ తర్వాత వీరందరికి కంపెనీ మంచి ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలను అందిస్తూ మార్గం చూపుతుంది. ఉద్యోగుల తొలగింపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన వ్యూహాత్మక పరివర్తన, ఇది ప్రస్తుతం తొలగింపుకి గురైన ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త ఉద్యోగుల నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు. గత నెలలో, శాప్ ల్యాబ్స్ యొక్క మాతృ సంస్థ శాప్ ప్రపంచవ్యాప్తంగా దాని "కోర్ బిజినెస్"పై దృష్టి పెట్టడానికి తొలగింపులను ప్రకటించింది. దీని వల్ల 3 వేలమంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్ 2022తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ తొలగింపులు ప్రకటించింది. (ఇదీ చదవండి: తడబడిన ట్విటర్.. నిమిషాల్లో వేల పిర్యాదులు) 2025 నాటికి కంపెనీ భారతదేశంలోని హెడ్‌కౌంట్ రెట్టింపు చేయనున్నట్లు, దీనికోసం దాదాపు 15,000 మంది సామర్థ్యంతో బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో కొత్త క్యాంపస్ ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే 41 ఎకరాల భూమిని కొనుగోలోను చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్, స్విగ్గీ, గూగుల్ వంటి సంస్థలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో శాప్ ల్యాబ్స్ కూడా చేరింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఈ జాబితాలోకి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా చేరతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. -
శాప్ సింధు
సింధు కోసం అంతమంది జర్మన్ ఉద్యోగులు ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారంటే సింధులో తప్పకుండా ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. ఏమిటది? ‘‘రాస్కో సాంబా’’ అంటుంటాడు పవన్ కల్యాణ్.. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో. సాంబా ఎవరంటే అలీ. రాస్కోవడం ఏంటంటే.. పవన్ టక్కున ప్రవచనం లాంటిదేదో మాట వదులుతాడు. దాన్ని నోట్ చేసుకోవాలి.. ‘రాస్కో సాంబా’ అనగానే అలీ. ఫన్నీగా ఉంటుంది సినిమా మొత్తం రిపీట్ అవుతూ ఉండే ఆ సీన్. సింధూ గంగాధరన్కీ ఒక సాంబా ఉన్నాడు. ఆ సాంబా.. మనిషి కాదు. చిన్న పుస్తకం. అధాటున తనకు వచ్చిన ఆలోచనల్ని.. చేస్తున్న పని ఆపి మరీ.. అందులో నోట్ చేసుకుంటుంటారు సింధు! అదొక అలవాటు ఆమెకు. అవన్నీ కలిపి ఎప్పటికో పుస్తకం వేస్తారట. అలాగని సింధు రైటర్ కాదు. మొన్నటివరకు ‘శాప్ ల్యాబ్స్ ఇండియా’ ఉద్యోగి. ఇప్పుడు అదే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ‘శాప్’ అంటే.. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రాడక్ట్స్. జర్మన్ కంపెనీ. శాప్ ఇండియా హెడ్డాఫీస్ బెంగళూరులో ఉంది. అందులోనే సింధు ఇప్పుడు ఎండీ. 8000 మందిని ఆమె లీడ్ చెయ్యాలి! జర్మన్ టెక్ జెయింట్ కంపెనీ ‘శాప్’ ఎండీ అయిన తొలి మహిళ ఆమె. బెంగళూరు యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చీ రాగానే 1999లో బెంగళూరులోని ‘శాప్ లాబ్స్’లో చేరిపోయారు సింధు. కొన్నాళ్లకే కంపెనీ ఆమెను జర్మనీలోకి లాగేసుకుంది. పెద్ద పొజిషన్, పెద్ద జీతం. పద్దెనిమిదేళ్లు అక్కడే పనిచేసి ఈ ఏడాదే ఇండియాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సెప్టెంబర్‌లో ఎం.డి.గా చార్జి తీసుకున్నారు. సింధుకు ఇద్దరు పిల్లలు. ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంటుంది కదా.. ‘కుటుంబాన్నీ, వర్క్ లైఫ్‌నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?’ అని! ఈ మాటకు పెద్దగా నవ్వేస్తారు సింధు. ‘‘ఎప్పటి మాట!’’ అంటారు. ‘‘దేని దారి దానిదే, దేని గోల్ దానిదే’’ అనేస్తారు. ‘ఆఫీస్‌లో ఒక ఉమన్ లీడ్ చేస్తోందే అనే ఫీలింగ్ మగ ఉద్యోగులలో కనిపిస్తుందా?’’ అని ఆటోమేటిక్‌గా ఇంకో ప్రశ్న. దీనికీ సింధు దగ్గర చక్కటి సమాధానమే ఉంది. ‘‘లీడర్ లేడీ అయినా, పురుషుడైనా.. వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకు పూర్తిగా తెలుసు అనే భావన టీమ్ సభ్యులలో కలిగితే కనుక.. పైన ఉన్నది ఆడా, మగా అనేది పోయి వాళ్ల కళ్లల్లో ‘లీడర్’ ఒక్కరే మిగులుతారు’’ అంటారు సింధు. అది ఆమె అనుభవం కూడా. జర్మనీలోనే సింధుకు ఇంకో అనుభవం ఎదురైంది. జర్మన్లు జర్మన్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇంగ్లిష్ మాట్లాడ్డం తక్కువ. అంత పెద్ద శాప్ కంపెనీలోనూ అదే వరస. సింధుకు జర్మనీ రాదు. టీమ్‌లో సభ్యులు చాలామందికి ఇంగ్లిష్ రాదు. ఎలా బండి నడవడం! ‘యు మస్ట్..’ అంటూ ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకొమ్మని సింధు వాళ్లకేమీ ఆర్డర్ వేయలేదు. తనే జర్మన్ని నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. మెటర్నిటీ బ్రేక్. సింధు ఇండియా వచ్చి వెళ్లే లోగా టీమ్‌లో అంతా ఇంగ్లిష్ మాట్లాడ్డం మొదలు పెట్టారు! కేవలం తమ బాస్ కోసం (అప్పటికే చిన్నపాటి బాస్ అయిపోయారు సింధు) స్పోకెన్ ఇంగ్లిష్‌లో కసరత్తు చేశారు. అది చాలా బాగా అనిపించింది సింధుకు. సంస్కృతులు ఎంత వేరైనా, కలుపుకునే మనుషులుంటే ప్రపంచమంతటా ఒకే సంస్కృతిలా అనిపిస్తుంది. సింధును వాళ్లు కలుపుకున్నారు. ఆఫీస్‌లో కొంతమంది అడిగేవారట.. ‘‘మేడమ్.. ఇండియాలో ఆడపిల్లగా పెరగడం వల్ల ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపిస్తుంటుందా?!’’ అని. అలాంటిదేమీ లేదని అంటారు సింధు. సింధుకు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లను ఏ ఆశలతోనైతే పెంచారో సింధునూ అవే ఆశలతో పెంచారు ఆమె తల్లిదండ్రులు. సింధు ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లో ఉండటానికి అది కూడా ఒక కారణం. అన్నట్లు.. సింధులోని ప్రత్యేకత ఏమిటని కదా అనుకున్నాం! ఏ కల్చర్లోనికైనా వెంటనే ఆమె తనని తాను మలుచుకుంటారు. అలాగని తన కల్చర్‌ని రూపుమాసిపోనివ్వరు. -
సోషల్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఐఎస్బీ–ఎస్ఏపీ మధ్య ఒప్పందం హైదరాబాద్: వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి ఆరంభించే స్టార్టప్‌లను ప్రోత్సహించాలని ఐఎస్బీ, ఎస్ఏపీ ల్యాబ్ ఇండియా నిర్ణయించాయి. గురువారమిక్కడి ఐఎస్బీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు సంస్థలూ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీన్లో భాగంగా జంప్‌స్టార్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ యాక్సిలరేటర్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రారంభదశలో ఉన్న 10 స్టార్టప్‌లకు, అభివృద్ధి చెందుతూ సాగుతున్న మరో 5 స్టార్టప్‌లకు ఈ యాక్సిలరేటర్ ద్వారా చేయూతనిస్తారు. వీటికి పూర్తి స్థాయి గైడెన్స్, మెంటర్షిప్, స్కేలింగ్ అప్, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటివి అందిస్తారు. ప్రధానంగా విద్య, వైద్యారోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వ్యవసాయం, టెక్నాలజీ స్టార్టప్‌లను దీనికింద ఎంపి క చేస్తారు. కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఎస్ఏపీ ల్యాబ్ ఇండియా ఎండీ దిలీప్‌కుమార్ ఖండేల్వాల్ తదితరులు పాల్గొన్నారు.