సింధు కోసం అంతమంది జర్మన్ ఉద్యోగులు ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారంటే సింధులో తప్పకుండా ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. ఏమిటది?
‘‘రాస్కో సాంబా’’ అంటుంటాడు పవన్ కల్యాణ్.. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో. సాంబా ఎవరంటే అలీ. రాస్కోవడం ఏంటంటే.. పవన్ టక్కున ప్రవచనం లాంటిదేదో మాట వదులుతాడు. దాన్ని నోట్ చేసుకోవాలి.. ‘రాస్కో సాంబా’ అనగానే అలీ. ఫన్నీగా ఉంటుంది సినిమా మొత్తం రిపీట్ అవుతూ ఉండే ఆ సీన్. సింధూ గంగాధరన్‌కీ ఒక సాంబా ఉన్నాడు. ఆ సాంబా.. మనిషి కాదు. చిన్న పుస్తకం. అధాటున తనకు వచ్చిన ఆలోచనల్ని.. చేస్తున్న పని ఆపి మరీ.. అందులో నోట్ చేసుకుంటుంటారు సింధు! అదొక అలవాటు ఆమెకు.
అవన్నీ కలిపి ఎప్పటికో పుస్తకం వేస్తారట. అలాగని సింధు రైటర్ కాదు. మొన్నటివరకు ‘శాప్ ల్యాబ్స్ ఇండియా’ ఉద్యోగి. ఇప్పుడు అదే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ‘శాప్’ అంటే.. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రాడక్ట్స్. జర్మన్ కంపెనీ. శాప్ ఇండియా హెడ్డాఫీస్ బెంగళూరులో ఉంది. అందులోనే సింధు ఇప్పుడు ఎండీ. 8000 మందిని ఆమె లీడ్ చెయ్యాలి! జర్మన్ టెక్ జెయింట్ కంపెనీ ‘శాప్’ ఎండీ అయిన తొలి మహిళ ఆమె. బెంగళూరు యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చీ రాగానే 1999లో బెంగళూరులోని ‘శాప్ లాబ్స్’లో చేరిపోయారు సింధు. కొన్నాళ్లకే కంపెనీ ఆమెను జర్మనీలోకి లాగేసుకుంది. పెద్ద పొజిషన్, పెద్ద జీతం. పద్దెనిమిదేళ్లు అక్కడే పనిచేసి ఈ ఏడాదే ఇండియాకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఈ సెప్టెంబర్‌లో ఎం.డి.గా చార్జి తీసుకున్నారు.
సింధుకు ఇద్దరు పిల్లలు. ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంటుంది కదా.. ‘కుటుంబాన్నీ, వర్క్ లైఫ్‌నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?’ అని! ఈ మాటకు పెద్దగా నవ్వేస్తారు సింధు. ‘‘ఎప్పటి మాట!’’ అంటారు. ‘‘దేని దారి దానిదే, దేని గోల్ దానిదే’’ అనేస్తారు. ‘ఆఫీస్‌లో ఒక ఉమన్ లీడ్ చేస్తోందే అనే ఫీలింగ్ మగ ఉద్యోగులలో కనిపిస్తుందా?’’ అని ఆటోమేటిక్‌గా ఇంకో ప్రశ్న. దీనికీ సింధు దగ్గర చక్కటి సమాధానమే ఉంది. ‘‘లీడర్ లేడీ అయినా, పురుషుడైనా.. వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకు పూర్తిగా తెలుసు అనే భావన టీమ్ సభ్యులలో కలిగితే కనుక.. పైన ఉన్నది ఆడా, మగా అనేది పోయి వాళ్ల కళ్లల్లో ‘లీడర్’ ఒక్కరే మిగులుతారు’’ అంటారు సింధు. అది ఆమె అనుభవం కూడా. జర్మనీలోనే సింధుకు ఇంకో అనుభవం ఎదురైంది.
జర్మన్‌లు జర్మన్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇంగ్లిష్ మాట్లాడ్డం తక్కువ. అంత పెద్ద శాప్ కంపెనీలోనూ అదే వరస. సింధుకు జర్మనీ రాదు. టీమ్‌లో సభ్యులు చాలామందికి ఇంగ్లిష్ రాదు. ఎలా బండి నడవడం! ‘యు మస్ట్..’ అంటూ ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకొమ్మని సింధు వాళ్లకేమీ ఆర్డర్ వేయలేదు. తనే జర్మన్‌ని నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. మెటర్నిటీ బ్రేక్. సింధు ఇండియా వచ్చి వెళ్లే లోగా టీమ్‌లో అంతా ఇంగ్లిష్ మాట్లాడ్డం మొదలు పెట్టారు! కేవలం తమ బాస్ కోసం (అప్పటికే చిన్నపాటి బాస్ అయిపోయారు సింధు) స్పోకెన్ ఇంగ్లిష్‌లో కసరత్తు చేశారు. అది చాలా బాగా అనిపించింది సింధుకు. సంస్కృతులు ఎంత వేరైనా, కలుపుకునే మనుషులుంటే ప్రపంచమంతటా ఒకే సంస్కృతిలా అనిపిస్తుంది.
సింధును వాళ్లు కలుపుకున్నారు. ఆఫీస్‌లో కొంతమంది అడిగేవారట.. ‘‘మేడమ్.. ఇండియాలో ఆడపిల్లగా పెరగడం వల్ల ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపిస్తుంటుందా?!’’ అని. అలాంటిదేమీ లేదని అంటారు సింధు. సింధుకు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లను ఏ ఆశలతోనైతే పెంచారో సింధునూ అవే ఆశలతో పెంచారు ఆమె తల్లిదండ్రులు. సింధు ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్‌లో ఉండటానికి అది కూడా ఒక కారణం. అన్నట్లు.. సింధులోని ప్రత్యేకత ఏమిటని కదా అనుకున్నాం! ఏ కల్చర్‌లోనికైనా వెంటనే ఆమె తనని తాను మలుచుకుంటారు. అలాగని తన కల్చర్‌ని రూపుమాసిపోనివ్వరు.
Comments
Please login to add a commentAdd a comment