భల్లూకాన్ని బంధించారు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎలుగుబంట్ల హల్చల్
మత్తుమందు ఇచ్చి పట్టుకున్న సిటీ హంటర్ నవాబ్
నెల రోజుల్లో మూడు ఆపరేషన్లు
సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ ఉత్తరాదిలో నెల రోజుల వ్యవధిలో మూడు ఆపరేషన్లు పూర్తి చేశారు. బిహార్‌లోని గయ ఫారెస్ట్ డివిజన్‌ను గడగడలాడించిన గజరాజును గత నెల ఆఖరి వారంలో మట్టుపెట్టాడు. ఆ తరువాత అదే ప్రాంతంలో విరుచుకుపడిన 16 ఏనుగుల్లో 15 గజాలను తరి మేసి... మరోదాన్ని బంధించారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ పరిధిలో జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఎలుగుబంట్లలో ఒక దానిని గురువారం బంధించారు. చంద్రాపూర్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే ఆహ్వానం మేరకు మంగళవారం హుటాహుటిన అక్కడకు వెళ్లి భల్లూకాల పనిపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను షఫత్ అలీ ఖాన్ శుక్రవారం ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు.
పవర్ ప్రాజెక్ట్ ఏరియాలోకి ప్రవేశించి...
చంద్రాపూర్ సమీపంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు అడవికి దగ్గరగా ఉంటుంది. సువిశాలమైన ఈ ప్రాజెక్టు ప్రాంగణంలో సిబ్బంది క్వార్టర్స్, జనావాసాలు, పాఠశాల ఉన్నాయి. గత వారం అటవినుంచి దారి తప్పి వచ్చిన రెండు భల్లూకాలు ప్రాజెక్టు ఏరియాలో ప్రవేశించి ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో రంగంలోకి దిగిన చంద్రాపూర్ ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే మంగళవారం షఫత్ అలీ ఖాన్ సహాయం కోరుతూ ఫోన్ చేయడంతో తక్షణం స్పందించిన ఆయన హుటాహుటిన చంద్రాపూర్ చేరుకున్నారు. బుధవారం అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎలుగుబంట్లు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి ట్రాంక్వలైజింగ్కు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు ప్రాంగణంలోని పాత క్వార్టర్స్‌లో ఎలుగుబంట్లు సేదతీరుతున్నట్లు గుర్తించిన ఆయన ఆ ప్రాంతంలోనే ట్రాంక్వలైజ్ చేయాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన పరికరా లు, పశువైద్యుడితో అక్కడకు చేరుకున్నారు.
పాత క్వార్టర్స్‌లో ‘దొరికింది’...
గురువారం మధ్యాహ్నం ఓ ఎలుగును గుర్తించి, మత్తుమందు ఇచ్చి బంధించారు. దీనిపై అలీ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇటు ప్రజలకు, అటు ఎలుగుబంటికీ ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగాం. భల్లూకానికి పూర్తి అనువైన ప్రాంతంలో ట్రాంక్వలైజ్ చేయడం కాస్త కష్టమే అయ్యింది. ట్రాంక్వలైజ్ చేసిన తర్వాత... దానికి మత్తు ఎక్కడానికి కొంత సమయం ఉంటుంది. అప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా దాడి చేసి చంపేస్తుంది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్న ఆ ఎలుగుబంటి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు గుర్తించాం. మత్తు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెడతాం. మరో ఎలుగుబంటి కోసం సెర్చ్ నడుస్తోంది’ అని వివరించారు.