సుప్త వీరాసనం
వీరాసనంలో కూర్చుని వెల్లకిలా పడుకునే భంగిమను సుప్తవీరాసనం అంటారు.
ఇలా చేయాలి
ముందుగా వీరాసనంలో కూర్చోవాలి... అంటే మోకాళ్లు మడిచి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవాలి. ఈ స్థితిలో అరికాళ్లు దేహానికి రెండు వైపులా ఆకాశాన్ని చూస్తుండాలి. అరచేతులను తొడల మీద బోర్లించాలి. వెన్నెముక నిటారుగా ఉంచి దృష్టిని నేరుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. దీనిని వీరాసనం అంటారు.
ఇప్పుడు నిదానంగా వెనుకకు వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత మరొకటిగా నేల మీద ఆనించాలి. ఈ స్థితిలో రెండుపాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి.
రెండు మోచేతుల సాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండుచేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో పూర్తి శరీరం నేలను తాకుతూ ఉంటుంది. పాదాలు శరీరానికి ఆనుకుని ఉంటాయి, మడమలు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటాయి. శ్వాస సాధారణంగా తీసుకుంటూ వదలాలి.
ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సాయంతో దేహాన్ని పైకిలేపుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
తొడల మీద ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
మోకాళ్లు, తొడలు శక్తిమంతం అవుతాయి.
ఆస్త్మా, బ్యాక్ పెయిన్, థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి.
గొంతు సమస్యలు తగ్గి స్వరం బాగుంటుంది.
జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు, స్థూలకాయులు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.
మొదటిసారి చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, హైదరాబాద్
మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్