సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు టీడీపీ నేతల టోకరా!
శాంతిపురం(చిత్తూరు): సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు చెందిన నాలుగు శాఖల్లోని వివిధ ఖాతాల నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు యువ నేతలు ఏకంగా రూ.10 లక్షలకు పైగా కొల్లగొట్టారు. రామకుప్పం శాఖలో తీగ లాగడంతో శాంతిపురం కేంద్రంగా గత మూడు నెలల నుంచి సాగిన ఈ వ్యవహారం బయ ట పడింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సప్తగిరి బ్యాంకులో ఔట్సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న నడింపల్లికి చెందిన సత్యకుమార్‌ను బ్యాంకు అధి కారులు అతిగా నమ్మారు. అతనికి కంప్యూటర్ పరి జ్ఞానం ఉండడంతో ఇతర పనులను కూడా అప్పగించారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకు న్న అతను కెనమాకులపల్లికి చెందిన తిప్ప అలియాస్ త్యాగరాజు, జంగాలపల్లికి చెందిన మునిరాజుతో కలిసి దోపిడీకి తెరతీశాడు. శాంతిపురం, రామకుప్పం, రాళ్లబూదుగూరు, గుడుపల్లి బ్రాంచుల్లో 60కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును డ్రా చేశారు.
ఇందుకోసం దీర్ఘకాలంగా ఆపరేట్ చేయని బ్యాంకు ఖాతాలు, మృతుల పేరుతో ఉన్న ఖాతాల ను ఎంచుకున్నారు. ఆయా ఖాతాల వివరాలతో తమ వారి ఫొటోలు అతికించి నకిలీ పాస్బుక్కుల ను సిద్ధం చేశారు. మృతుల ఆధార్ నంబర్లను బ్యాంకులో మార్చివేసి తమకు కావాల్సిన ఆధార్ నంబర్లను చేర్చారు. ఆయా ఖాతాలనుంచి తరచుగా గుట్టుచప్పుడు కాకుండా నగదు విత్‌డ్రా చేశారు. ఈ క్రమంలోనే.. రామకుప్పం బ్రాంచిలో ఓ మృతు డి ఖాతా నుంచి రూ.49 వేలను విత్‌డ్రా చేయడంతో.. అప్పటికే ఖాతాలోని నగదు గురించి అవగాహ న ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం బ్యాంకుకు వచ్చి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతా వివరాలను పరిశీలించడంతో విషయం బయట పడింది.
గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు!
బ్యాంకు నుంచి స్వాహా చేసిన మొత్తంలో ఇప్పటి వరకూ లెక్క తేలిన మొత్తాన్ని వెనక్కు కట్టించి విషయం సద్దుమణిగించేందుకు టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రూ.4లక్షలను నిందితుల నుంచి బ్యాంకు అధికారులు రికవరీ చేశారు. ఈ వ్యవహారంపై స్థానిక బ్రాంచి మేనేజర్ దస్తగిరిని వివరణ కోరగా.. మృతుల ఖాతాల్లో నుంచి నకిలీ పాసు పుస్తకాలతో సొమ్ము డ్రా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాళ్లబూదుగూరు ఎస్ఐ మునిస్వామి తెలిపారు.