దసారా
- ఏరులై పారుతున్న గుడుంబా
- పండుగ నేపథ్యంలో
- పెద్దమొత్తంలో తయారీ.. అమ్మకాలు
- చేష్టలుడిగిన యంత్రాంగం
మంచాల/దోమ/యాచారం: గ్రామాల్లో సారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. మంచాల మండ లం నగరానికి చేరువలో ఉండడంతో ఇక్కడ తయారు చేసిన సారాను అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. మండలంలోని పటేల్ చెరువు తండా, బుగ్గ తండా, సత్తి తండా, ఆంబోత్ తండా, బోడకొండ, కొర్రం తండా, సల్లిగుట్ట తండా, వెంకటేశ్వర తండా, చెన్నారెడ్డి గూడ తండా, బండలేమూర్, అజ్జిన తండాల్లో సారా తయారీ ముమ్మరంగా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సారా తయారీదారులు సమీప ప్రాంతాలకు నిత్యం సాయంత్రం సమయంలో డబ్బాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారాను రవాణా చేస్తున్నారు. దూర ప్రాంతాలకైతే బస్సుల్లో తీసుకెళ్తున్నారు. రవాణా సదుపాయం లేని గ్రామాలకు స్కూటర్లపై డబ్బాల్లో, ట్యూబుల్లో పంపిస్తున్నారు. నిత్యం మంచాల మండల పరిధిలో వేలాది లీటర్ల సారా విక్రయాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
పెరిగిన ధరలు.. గతంలో సీసా సారా ధర రూ. 40 ఉండేది. ప్రస్తుతం విక్రయదారులు సీసా సారా రూ. 50 -60 లకు అమ్ముతున్నారు. కాగా ఇటీవల సారా విక్రేతలు రూటు మార్చారు. సీసాల్లో విక్రయించడం ఇబ్బందిగా ఉందని ప్యాకెట్లలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ. 15 చొప్పున విక్రయిస్తున్నారు. తయారీదారులు అక్రమంగా తమ ఇళ్లల్లో సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, నవసాగరం వంటి వాటిని పెద్దమొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారు. ఆరుట్ల, లోయపల్లి, ఎల్లమ్మ తండా తదితర ప్రాంతాల్లో వ్యాపారులు సారా తయారీ సామగ్రిని విక్రయిస్తున్నారు.
చర్యలు శూన్యం..
అక్రమార్కులు యథేచ్ఛగా సారా తయారీ, విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే వారే కరువవయ్యారు. మంచాల మండల పరిధిలో సారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ సీఐ తుక్యా నాయక్ వివరణ కోరగా.. దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికులు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
పెరిగిన అమ్మకాలు..
దోమ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొందరు పట్టపగలే సారా మత్తులో రోడ్లపై జోగుతున్నారు. ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న నిరుపేదలు సంపాదించిన డబ్బంతా సారా మహ మ్మారికి తగిలేస్తున్నారు. దీంతో ఇల్లు గడవడం కష్టం మారుతోందని బాధిత మహిళలు కంటతడి పెట్టుకుంటున్నారు. దోమ మండల కేంద్రంతో పాటు మల్లేపల్లి, పాలేపల్లి, రాకొండ, లింగన్పల్లి, ఎల్లారెడ్డి పల్లి, ఊట్పల్లి, బ్రాహ్మణ్పల్లి, కిష్టాపూర్, గుండాల్, దాదాపూర్ తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు 40 సారా బట్టీలు, 100కు పైగా విక్రయ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వీటి నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులకు ప్రతినెల మామూళ్లు చెల్లించి తమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. కొందరు తయారీదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఎక్సైజ్ అధికారులు ముట్టజెబుతున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టించుకునే వారేరి..?
పలువురు యువజన సంఘాల సభ్యులు ఆయా గ్రామాల ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు. సారా మహమ్మారి బారిన పడితే అనారోగ్యంపాలై ఇళ్లు గుల్లవుతాయని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సారా రక్కసిని దూరం చేసేందుకు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సారా అమ్మరాదు, కొనరాదని తీర్మానాలు చేస్తున్నారు. సారా అమ్మకాలు, తయారీపై అధికారులకు సమాచారం ఇస్తే పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకే కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొని అక్రమార్కుల భరతం పట్టాలని పలువురు కోరుతున్నారు.
గుప్పుమంటున్న గుడుంబా..
యాచారం మండల పరిధిలోని నక్కగుట్ట, తక్కళ్లపల్లి తండాల్లో 20 వరకు సారా దుకాణాలు ఉన్నాయని స్థానికు లు చెబుతున్నారు. ఇక్కడ నిత్యం వందల లీటర్లలో సారా విక్రయాలు జ రుగుతున్నాయి. యాచారం, మొ గుళ్లవంపు, చింతపట్ల, మొండిగౌరెల్లి, మ ల్కీజ్గూడ, తక్కళ్లపల్లి తదితరల గ్రామాల నుంచి జనం ఇక్కడికి సారా తాగేందుకు వస్తుంటారు. కొందరు పీకల దాకా సారా తాగి మార్గమధ్యంలో పడిపోతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల యాచారానికి చెందిన ఒకరు, చింతపట్లకు చెందిన ఇద్దరు సారా తాగి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు.
సారా తయారీదారులు, విక్రేతలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల యాచారం ఎంపీపీ జ్యోతీనాయక్ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎక్సైజ్ అధికారుల మద్దతుతోనే సారా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సారా విక్రయాలు అరికట్టకుంటే ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని నాయకులు హెచ్చరించారు.