ఒక్క సినిమా... ముగ్గురు దర్శకులు
నిఖిల్ కొత్త సినిమాకు ముగ్గురు దర్శకులు పని చేస్తున్నారు. అయితే... ముగ్గురూ దర్శకత్వం వహించడం లేదు. ఒకరు మాటలు రాస్తుంటే, మరొకరు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకొకరు దర్శకుడు. నిఖిల్ హీరోగా శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఓ సినిమా నిర్మించనున్నారు.
నిఖిల్‌తో ‘స్వామి రారా, కేశవ’ వంటి హిట్స్ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రైటర్. నిఖిల్ ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి డైలాగ్ రైటర్. ‘‘ఈ సినిమాలో 18 నుంచి 30 ఏళ్లలోపు అబ్బాయిలు ఎనిమిది మంది, అమ్మాయిలు ముగ్గురు కీలక పాత్రలు చేయనున్నారు. వాళ్ల కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాం’’ అన్నారు రామబ్రహ్మం సుంకర. ఈ చిత్రానికి సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్ గరికిపాటి, సహ–నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.