‘నడిగర్’లో వివాదాలు అందరికీ నష్టమే
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న శరత్‌కుమార్ వర్గం,విశాల్ వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం పరిశ్రమ వర్గాలను కలవర పెడుతోందన్నది నిజం.ఈ వ్యవహారంపై సంఘం సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్, నగరి శాసనసభ సభ్యురాలు,నటి రోజా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.అందులో ఆమె పేర్కొంటూ ఇండియన్ హాలీవుడ్‌గా ఖ్యాతి గాంచిన చెన్నై మహానగరంలో దక్షిణాది చిత్ర నిర్మాణాల స్వర్ణ యుగంలో నెలకొల్పబడిన సంఘం ద క్షిణ భారత నటీనటుల సంఘం. అత్యధిక తమిళసభ్యులు కలిగి ఉండడంతో చెన్నైలోనే దక్షిణ భారత నటీనటుల సంఘం కొనసాగుతోంది.
విమర్శలు అందరికీ చేటే
ప్రస్తుతం సంఘం ఎన్నికలు జరగన్న నేపథ్యంలో పోటీలో ఉన్న శరత్‌కుమార్ జట్టు,విశాల్ జట్టు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు హర్షనీయం కాదు.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అందరికీ చేటు కలుగుతుంది.అనుభవజ్ఞులైన శరత్‌కుమార్,రాధారవి లాంటి వారు సంఘానికి చేసిన సేవలను మరవరాదు.అప్పుల్లో ఉన్న సంఘాన్ని రుణవిముక్తి కలిగించిన వారిలో విజయకాంత్,శరత్‌కుమార్,రాధారవి లాంటి వారి కృషి ప్రశంసనీయం అన్నారు. విశాల్ వర్గం చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేయలేము.ఇంతకు ముందు కూడా తమిళ నిర్మాతల మండలిలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.అప్పుడు ఆర్కే.సెల్వమణి,పీ.వాసు కల్పించుకుని చక్కదిద్దారు.