ధర్మవరంలో ఉద్రిక్తత
⇒ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గాల బాహాబాహీ
⇒ ఇరు వర్గాల మధ్య రాళ్ల వర్షం.. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం
ధర్మవరం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం సబ్‌స్టేషన్ వద్ద పరిటాల వర్గీయులు పవన విద్యుత్ కేబుల్ పనులు చేస్తున్నారు. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం వద్దనున్న గాలిమరల నుంచి ఉత్పన్నమయ్యే పవన విద్యుత్ (విండ్ పవర్)ను ధర్మవరం 220/122/33 సబ్‌స్టేషన్‌కు పంపేందుకు సరయు కంపెనీ టెండర్ సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఈ పనులు చేస్తున్నారు.అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని, వాటిని ఆపివేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు పరిటాల వర్గీయులకు సూచించారు.
ఆ మాటలను ఖాతరు చేయకుండా శుక్రవారం చిగిచెర్ల రోడ్డు వద్ద పనులు కొనసాగించారు. ఈ క్రమంలో చిగిచెర్ల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్ష న్స్ చేస్తోంది. ఈ పనులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే కేబుల్ పనులు చేస్తున్న వారిని పిలిచి మందలించి వెళ్లిపోయారు. అయినా వారు పనులు ఆపకపోవడంతో ఆర్అండ్బి, ట్రాన్స్‌కో, పోలీసులకు ఆయన ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ అక్కడికి వెళ్లి పనులు చేస్తున్న పరిటాల వర్గీయులను అడ్డుకున్నారు.
తోపులాట.. రాళ్ల దాడి..: మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి సుమారు 200 మంది అనుచరులను «ధర్మవరానికి పంపారు. అప్పటికే సూరి వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్లు రువ్వుకోవడం జరిగింది. అనంతపురం నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సూరి అనుచరులు దాదాపు 15 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు.