‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ మరోసారి దీక్షకు దిగాడు. అతడు శుక్రవారం ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తమకు నష్టం వచ్చిందని, దీనిపై నిర్మాత శరత్ మరార్... కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
కాటమరాయుడు చిత్ర హక్కులను తక్కువ ధరకు ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చారని సంపత్ అన్నారు. అయితే వేరే డిస్ట్రిబ్యూటర్‌కు అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్ ఆరోపించారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకూ తన దీక్ష విరమించేది లేదని సంపత్ కుమార్ స్పష్టం చేశాడు. కాగా ఈ నెల 24 న కాటమరాయుడు విడుదల కానున్న నేపథ్యంలో సంపత్ కుమార్ నిరాహార దీక్ష టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది
కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను సంపత్ కుమార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, పవన్ కల్యాణ్ శ్రీనివాస్ తనను కలవనివ్వడం లేదని గతంలో సంపత్ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.