ఐక్యతతోనే గౌడ కులస్తుల అభివృద్ధి: స్వామిగౌడ్
హైదరాబాద్: గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి పార్టీలకతీతంగా, సంఘటితంగా ముందుకు సాగాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రభుత్వం పెట్టలేదని అనడం కంటే ప్రతి సొసైటీ ఒక విగ్రహం పెట్టేవిధంగా ప్రయత్నించాలని సూచించారు.
సర్దార్ పాపన్న వంటి మహోన్నత వ్యక్తి పుట్టిన గౌడ కులంలో తాను పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే గౌడ కులస్తులు అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా తాటి, ఈత చెట్లను నాటించాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో..
హైదరాబాద్ అమీర్‌పేటలోని సితారా హోటల్లో అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌడ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా కేఈ వేణుమాధవ్, తెలంగాణ అధ్యక్షుడిగా ఎ.మాణిక్ప్రభుగౌడ్లతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీహీరో, నిర్మాత జైహింద్‌గౌడ్, ఉపేందర్‌గౌడ్, బీసీ మహిళా సంక్షేమ అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు.