రాజ్యాధికారం దక్కినప్పుడే నివాళి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. పాపన్న ఆశయ సాధన కోసం బహుజన వర్గాలు ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. గురువారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 366వ జయంతి ఉత్సవాలు జరిగాయి. కృష్ణయ్య మాట్లాడుతూ, ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించిన సర్వాయి పాపన్న చరిత్రలో గొప్ప పాలకుడిగా, బహుజనులకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. పాపన్న స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా సంఘటితంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
పాపన్న స్వయం పాలనను ప్రకటించుకుని పాలించినట్లే, తెలంగాణలో కూడా బీసీలు 2019లో రాష్ట్ర అసెంబ్లీపై బీసీల జెండాను ఎగురవేయాలన్నారు. పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని, పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బీసీ మండల్ తదితరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ర్యాగ అరుణ్, శారదాగౌడ్, గూడూరు భాస్కర్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, సువర్ణ, అరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.