వారసత్వ ఉద్యోగాల్లో కుట్ర
సింగరేణి కార్మికులకు సర్కారు మోసం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికు లను కూడా మోసగించారని, సింగరేణి వార సత్వ ఉద్యోగాల విషయంలో ఆయన చేసిన మోసం అందరికీ అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫి కేషన్ రానున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీ భవన్లో టీపీసీసీ సింగరేణి సబ్‌కమిటీ సమా వేశం జరిగింది.
సబ్‌కమిటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ కుట్ర చేసిందని విమర్శించారు. గుర్తింపు ఎన్నికలు వస్తున్న సమయంలో వారసత్వ ఉద్యోగాల జీవో ఇచ్చారని, అయితే దానిపై తెలంగాణ జాగృతి వాళ్లతోనే కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని మోసం చేశారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై 55 వేల మంది కార్మికులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించడం ద్వారా కేసీఆర్ కు బుద్ధిచెప్పాలన్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి, మరో నేత జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సింగరేణిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర చేపడతామన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు.