జిల్లా జైలులో సీనియర్ సివిల్‌జడ్జి విచారణ
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లాకోర్టు సీనియర్ సివిల్ జడ్జి బాందెఅలీ శనివారం సారంగాపూర్ జిల్లా జైలును సందర్శించారు. జైల్లో అండర్టయల్ ఖైదీలుగా ఉన్న 18-21 ఏళ్ల వయసున్న ఖైదీలను ఆయన విచారించారు. ఖైదీలతో మాట్లాడి కుటుంబ సభ్యుల వివరాలు, నేరచరిత్రను అడిగి తెలుసుకున్నారు. వారు చదువుకున్న పాఠశాలలో వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను తెప్పించి నిర్ధారణ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
18 ఏళ్ల వయసుకంటే తక్కువ ఉన్న ఖైదీలను గుర్తించి వారిని జైలు నుంచిజోనల్ జస్టిస్ అబ్జర్వేషన్ హోంకు పంపిస్తామని చెప్పారు. మహిళల బ్యారక్‌లో మహిళా ఖైదీలను ఆయన విచారించారు. వారి పిల్లలకు పౌష్టికాహారం అందుతుందో లేదో తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమతలేని ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదులను నియమిస్తామని, అర్హులను బెయిల్‌పై విడిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సి.శంకరయ్య, జైలర్ వీవీ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ జైలర్ మోహన్‌రెడ్డి, జైలు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.