'నా హత్యకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు'
అనంతపురం: టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. తమ అక్రమాలకు అడ్డుచెబుతున్నారన్న కారణంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డారు. మరికొన్ని సందర్భాలలో సొంత పార్టీకే చెందిన మహిళా నేతలను సైతం వదలని టీడీపీ అధిష్టానం తాజాగా ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఓ సర్పంచ్ హత్యకు దుండగులు యత్నించడంతో వారిలో ఆందోళన నెలకొంది. తన హత్యకు టీడీపీ నేతలు కుట్రపన్నారని నల్లచెరువు సర్పంచ్ రవికుమార్ రెడ్డి ఆరోపించడం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది.
కొందరు గుర్తు తెలియని దుండగులు సుమోలో నల్లచెరువు మండల కేంద్రానికి వచ్చారు. సర్పంచ్ రవికుమార్ ఇంటిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. అయితే విషయాన్ని గమనించిన సర్పంచ్ గట్టిగా కేకలు వేయడంతో దుండగులు సుమోలో పారిపోయారు. దీనిపై బాధిత నేత రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన హత్యకు టీడీపీ కుట్రపన్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా టీడీపీ నేతల పనే అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు నల్లచెరువులో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాన్ ప్రకారమే రవికుమార్ హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది.