కంకర మిల్లు పనుల అడ్డగింత
సర్వారం (గరిడేపల్లి) : మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఈసీఎల్ కంకర మిల్లులోని డాంబర్ మిక్సర్ ప్లాంట్ పనులను బుధవారం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు సర్వారం వెళ్లిన జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ భీమపంగు సోమమ్మ, సర్పంచ్ బజారమ్మను ప్లాంట్ విషయంపై గ్రామస్తులు నిలదీశారు. డాంబర్ మిక్సర్ ప్లాంట్‌తో దుర్గంధం, పొగ వ్యాపిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై ఎన్నిసార్లు చెప్పినా ప్లాంట్ యజమాన్యం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో విషయాన్ని జెడ్పీటీసీ వెంటనే ఫోన్ ద్వారా తహసీల్దార్‌కు వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లి పనులను అడ్డుకున్నారు. దీంతో ప్లాంట్ పనులను నిలిపివేశారు. అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లగానే మళ్లీ పనులను ప్రారంభించడంతో తిరిగి వెళ్లిన గ్రామస్తులు, నాయకులు తహసీల్దార్ వచ్చే వరకు కదిలేది లేదని బీష్మించుకూర్చున్నారు. దీంతో తహసీల్దార్ జయశ్రీ ప్లాంట్ వద్దకు చేరుకొని గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ప్లాంటులో ఉపయోగిస్తున్న కెమికల్ వివరాలను తెలపాలని, ప్లాంటును మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న ప్లాంటు నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, కెమికల్‌ను సేకరించి విచారణ జరుపుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుమ్మడెల్లి అంజయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కర్నాటి నాగిరెడ్డి, డైరెక్టర్లు సీతారాములు, పగిడి అంజయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.