సెమీస్ కు చేరిన అజయ్ జయరామ్
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ కు మిశ్రమ పలితాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు టోర్నీ నుంచి నిష్ర్రమించగా.. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ కు సెమీ ఫైనల్ కు చేరాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ 21-19, 16-21, 21-16 తేడాతో జపాన్ ఆటగాడు షో ససాకీని బోల్తా కొట్టించి సెమీస్ లోక ప్రవేశించాడు.
తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జయరామ్.. తదుపరి గేమ్ ను కోల్పోయాడు. రెండో సెట్ తొలి అర్థభాగంలో జయరామ్ 6-1 తేడాతో ముందంజలో పయనించినా.. షో ససాకీ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆ సెట్ ను చేజిక్కించుకున్నాడు. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. ఆ సెట్ లో తిరిగి పుంజుకున్న జయరామ్ ఆద్యంతం ఎదురుదాడికి దిగి షోససాకీని కోలుకోనీయకుండా చేశాడు.ఈ తాజా గెలుపుతో ఇరువురి ముఖాముఖి రికార్డును జయరామ్ 1-2 కు తగ్గించాడు.