శశికపూర్‌కు ‘ఫాల్కే’ అవార్డ్
న్యూఢిల్లీ: దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి కపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు.
బాలనటుడిగా..: నాలుగేళ్లకే బాల నటుడిగా తండ్రి దర్శకత్వం వహించిన పలు నాటకాల్లో కపూర్ నటించారు. ఆగ్(1948), ఆవారా(1951) తదితర సినిమాల్లోనూ బాలనటుడిగా కనిపించారు. ఆ తరువాత పోస్ట్‌బాక్స్ నెం 999, గెస్ట్‌హౌజ్, మనోరంజన్ మొదలైన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1961లో ధర్మపుత్రతో హీరోగా మారి, దాదాపు 116 సినిమాల్లో ప్రధానపాత్రలు పోషించారు. మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ వారి సినిమాలు సహా పలు అమెరికన్, బ్రిటిష్ సినిమాలు, నాటకాల్లో నటించిన ఘనత శశికపూర్కే దక్కింది. 1978లో సొంతంగా ఫిల్మ్వాలాస్ నిర్మాణ సంస్థను నెలకొల్పి జునూన్, కల్యుగ్, చౌరంఘీలేన్, విజేత, ఉత్సవ్ తదితర సినిమాలు నిర్మించారు. బ్రిటిష్ నటి జెన్నిఫర్ కెండాల్‌ను శశికపూర్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు కునాల్ కపూర్, కరణ్ కపూర్.. ఒక కుమార్తె సంజనాకపూర్ ఉన్నారు. 1984లో జెన్నిఫర్ కేన్సర్‌తో మరణించారు.
నందాతో హిట్ పెయిర్
రాఖీ, జీనత్ అమన్, హేమమాలిని.. హీరోయిన్లతో సినిమాల్లో నటించినా.. నందాతో కలిసి నటించిన రొమాంటిక్ సినిమాలు కపూర్‌ను రొమాంటిక్ హీరో గా నిలబెట్టాయి. వారిద్దరూ జంటగా నటించిన ‘జబ్జబ్ ఫూల్ ఖిలే’, ‘నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే’ తదితర సినిమాల్లో ఆర్డీ బర్మన్ స్వరకల్పనలో మొహమ్మద్ రఫీ గానం చేసిన పాటలు నేటికీ ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలుస్తాయి. 2011లో పద్మభూషణ్ అందుకున్న శశికపూర్‌కు.. 1986లో న్యూఢిల్లీ టైమ్స్ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది.