వేటు పడింది
జమ్మికుంట మాజీ తహసీల్దార్, వీఆర్వో సస్పెన్షన్
జమ్మికుంట రూరల్ : ఏసీబీ కేసులో ఇటీవల అరెస్టయిన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజని, పట్టణ వీఆర్వో శ్రీనివాస్‌లపై సస్పెన్షన్ వేటుపడింది. జమ్మికుంట తహసీల్దార్‌గా 18 నెలల పాటు పని చేసిన రజని, పట్టణ వీఆర్వోగా పనిచేసిన శ్రీనివాస్ భూ రికార్డుల సవరణ, పేరు మార్పిడి, పట్టాదారు పాసుపుస్తకాల జారీలో అడ్డగోలు అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి మే 30న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జూన్ 13న ఏసీబీ డీజీ ఏకే.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. ఏకే.ఖాన్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు రెండు దఫాలుగా లోతుగా విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుని గతనెల 22న రజని, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వారికి ఇప్పటికీ బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ3గా పేర్కొన్న రజని డ్రైవర్ పరారీలో ఉన్న కారణంగా అతడికి సైతం బెయిల్ మంజూరు కాలేదని తెలిసింది.