ఏఎన్‌యూలో ఎస్‌డీఏఏ కేంద్రం ప్రారంభం
గుంటూరు: ఇస్రో సాంకేతిక సహకారంతో నడిచే ఎస్‌డీఏఏ (శాటిలైట్ డేటా అనాలసిస్ అండ్ అప్లికేషన్) కేంద్రాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య కె.వియన్నారావు ప్రారంభించారు. ఇస్రో నుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని సమాజానికి, పరిశోధనలకు, విద్యాపరమైన అంశాలకు ఉపయోగించటానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది.
ఆయా ప్రాంతాల్లో ఉండే భూగర్భ జలాలు, ఖనిజాలు, కోతకు గురయ్యే ప్రాంతాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సారవంతమైన భూమిని గుర్తించటం, అటవీ సంపదను గుర్తించి దాన్ని పరిరక్షించటం, వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందే సమాచారాన్ని చేరవేయటం, కోత ప్రాంతాలను గుర్తించటం వంటి చర్యలను ఈ కేంద్రం ద్వారా నిర్వహిస్తారు.
ఇస్రో నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించి దాన్ని అవసరమైన విధంగా ఆయా జిల్లాల ప్రభుత్వ అధికారులకు ఏఎన్‌యూ పరిశోధన కేంద్రం అందిస్తుంది. ఇస్రో అనుసంధానంగా నడిచే పరిశోధన కేంద్రాన్ని ఒక విశ్వవిద్యాలయానికి మంజూరు చేయటం దేశంలోనే ఇదే మొదటిసారని పరిశోధన కేంద్రం కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సిద్దయ్య చెప్పారు.