సత్యసాయి విద్యాసంస్థలు గ్రామాలకు విస్తరించాలి
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచన
సాక్షి, విశాఖపట్నం/రాజాం(శ్రీకాకుళం): నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, అలాంటి విద్య సత్యసాయి విద్యా సంస్థల ద్వారా అందుతోందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్యసాయి విద్యాసంస్థలు విస్తరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి పాఠశాలల ఐదో జాతీయ స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సత్యసాయి కూడా విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. మానవ విలువలు విద్యలో భాగంగా ఉండాలని, విలువల్లేని విద్య శూన్యమని చెప్పారు.
1970లో పుట్టపర్తిలోనే ఉద్యోగ జీవితాన్ని ఆరంభించానని, అప్పట్నుంచే సత్యసాయిబాబాతో తన అనుబంధం మొదలైందని గుర్తుచేసుకున్నారు. సత్యసాయి విద్యా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్యా మాట్లాడుతూ ప్రశాంతి నిలయంలో ఇంటర్నేషనల్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
దేశం గర్వించేలా ఎదగండి..
దేశం గర్వించదగ్గ శక్తిలా ఎదగాలని విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉద్బోధించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్‌ఐటీ కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి భావాలతో పాటు ఆధ్యాత్మికత, యోగశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని గవర్నర్ కోరారు. ఆరోగ్యం, విద్య ప్రధానాంశాలుగా విలువలతో కూడిన విద్యను ప్రాథమిక స్థాయి నుంచే అభ్యసించి బలమైన పునాదులు వేసుకోవాలని ఆకాంక్షించారు. గురువులను గౌరవించడం, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి విషయాలను కూడా విద్యాలయాల్లో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు, మాజీ డీజీపీ హెచ్‌జె దొర, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈవో రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు.