సమ్మె బాటలో సత్యసాయి సిబ్బంది
పురుషోత్తపట్నం (సీతానగరం) : ఉభయ గోదావరి జిల్లాల్లోని 458 గ్రామాలు గుక్కెడు నీటికి ఇక్కట్లు పడనున్నాయి. రెండు జిల్లాల్లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మె చేయక తప్పడం లేదని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు నిర్వహణ కార్మికుల సంఘం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి శాఖల అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, మామిడిపల్లి వెంకట రామసత్య వరప్రసాద్ బుధవారం పురుషోత్తపట్నంలో తెలిపారు. ఈ నెల 16 లోపు జీతాలు ఇవ్వకపోతే అక్టోబర్ 10 నుంచి సమ్మెకు దిగుతామని గతనెల 28న కలెక్టర్, లేబర్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు, ప్రాజెక్టును నిర్వహించే ఎల్అండ్టీకి నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. తూర్పుగోదావరిలో 120 మంది, పశ్చిమ గోదావరిలో 152 మంది జీతాలందక క ష్టాలు పడుతున్నామని, గత్యంతరం లేక సమ్మె చేస్తున్నామని చెప్పారు.
మూడులక్షల మందికి నీటికష్టాలు..
జిల్లాలో పురుషోత్తపట్నంలోని సత్యసాయి ప్రాజెక్టు నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండ లాల్లోని 74 గ్రామాలకు, కుట్రవాడ ప్రాజెక్టు నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల మండలాల్లోని 125 గ్రామాలకు, సీలేరు ప్రాజెక్టు నుంచి 17 గ్రామాలకు, పశ్చిమ గోదావరిలోని పోలవరం సత్యసాయి ప్రాజెక్టు నుంచి పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు తదితర 17 మండలాల్లోని 242 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 458 గ్రామాల్లోని మూడు లక్షల మంది సమ్మె కారణంగా తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తుంది.