పంపా సరోవరమే... పాలసంద్రమై
కనుల పండువగా సాగిన సత్యదేవుని తెప్పోత్సవం
అమ్మవారితో కలసి హంసవాహనంపై స్వామివారి జలవిహారం
తిలకించి పులకించిన భక్తజనం
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినవేళ పంపా సరోవరం పాలసంద్రంగా శోభిల్లింది. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి
సమేతుడైన అన్నవరం సత్యదేవుడు.. పంపా జలశయంలో హంసవాహనంపై విహరించిన తరుణాన.. ఆ సంరంభాన్ని వీక్షించిన భక్తకోటి తన్మయత్వం చెందింది. పంపా జలాశయమే పాలసంద్రమై.. హంసవాహనమే శేషశయ్య కాగా.. సాక్షాత్తూ ఆ లక్ష్మీనారాయణులుగా అమ్మవారు, సత్యదేవుడు భక్తులకు దర్శనమిచ్చారు.
- అన్నవరం
పంపా సరోవరపుటలలు.. సోమవారం రాత్రి పులకించిపోయూరుు. కారణం- శీతల పవనాలు తమను
అల్లనమెల్లన తాకుతున్నందుకు కాదు..అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి సత్యదేవుడు
విహరించే హంసవాహనానికి తాము బోయూలైనందుకు! నింగిలోని జాబిలి మోము.. పున్నమి రెండు రోజులుందనగానే నిండుగా వెలిగిపోరుుంది. కారణం.. స్వామి విహారాన్ని తిలకించినందుకు! క్షీరాబ్ది
ద్వాదశి సందర్భంగా సత్యదేవుని తెప్పోత్సవం పంపా సరోవరంలో నయనమనోహరంగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకను వీక్షించి, పరవశులయ్యారు.
కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా కాల్పులు, రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో దేదీప్యమానంగా ప్రకాశించిన పంపా తీరంలో రత్నగిరివాసుని తెప్పోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. రత్నగిరి నుంచి సత్యదేవుడు, అమ్మవార్లను సాయంత్రం 5.30 గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపా నదీ తీరంలోని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించిన పండితులు.. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్థి, ఆశీర్వచనం అందజేశారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలను నివేదించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, చిట్టిశివ ఘనపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, అర్చకులు కోట శ్రీను, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఛామరి కన్నబాబు, పాలంకి పెద పట్టాభి తదితరులు నిర్వహించారు.
పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను పంపా నదిలో హంసవాహనంగా తీర్చిదిద్దిన తెప్పమీదకు పండితుల మంత్రోచ్చారణ మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. తెప్పమీద ప్రత్యేక మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ.. స్వామి, అమ్మవారు ముచ్చటగా మూడుసార్లు పంపా నదిలో హంసవాహనంపై విహరించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎంపీ తోట నరసింహం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, తుని మార్కెట్ యార్డ చైర్మన్ యనమల కృష్ణుడు, పర్వత రాజబాబు తదితరులు తెప్పపైకి ఎక్కి స్వామి, అమ్మవార్లతో కలిసి విహరించారు.
తెప్పోత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. తెప్పోత్సవానికి పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను, తుని అగ్నిమాపక శకటాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, అన్నవరం ఎస్సై జగన్మోహన్ బందోబస్తును పర్యవేక్షించారు. ఉత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు రావడంతో పంపా తీరం, ఘాట్‌రోడ్ చాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద నుంచి కూడా పలువురు ఉత్సవాన్ని తిలకించారు.
ఇదేం ఆనవాయితీ సత్యదేవా?
తెప్పోత్సవం ప్రారంభమైన తరువాత ప్రముఖులు ప్రత్యేక బోటులో వచ్చి నది మధ్యలో తెప్పలోకి ఎక్కడం ఓ ఆనవాయితీగా మారినట్టుంది. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఇలా చేయడం వివాదస్పదం కాగా.. ఈసారి ఆ వంతు ఎంపీ తోట నరసింహం తదితరులదైంది. రాత్రి 7.15 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కాగా, అప్పటికి ఎంపీ రాలేదు. తెప్ప ఒక రౌండ్ పూర్తి చేసేసరికి 7.40 గంటలైంది. ఆ సమయానికి అనుచరులతో వచ్చిన తోట నది మధ్య ఉన్న తెప్ప వద్దకు బోటుపై చేరుకున్నారు. కొంతసేపటికి మరో బోటులో తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు కూడా వచ్చి తెప్ప ఎక్కారు. తెప్పను మధ్యలో ఆపి ప్రముఖులను ఎక్కించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.