సతీష్ బాధ్యతల స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ శనివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇంతకాలం ఢిల్లీ ఈ పదవిలో కొనసాగిన కేంద్ర మంత్రి డా. హర్షవర్ధన్ ఆయనకు లాంఛనంగా ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు తమ పార్టీపై నమ్మకం ప్రకటించారని, అందువల్ల వారికి అన్ని విధాలా సేవ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లను కాదని ప్రజలు తమపై విశ్వాసం కనబరిచారని ఆయన చెప్పారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఏ రాజకీయ నేపథ్యం లేకుండా సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన వ్యక్తి ఈ స్థానానికి చేరుకోవడం కేవలం బీజేపీలోనే సాధ్యమని ఆయన చెప్పారు.
తాను ప్రతి దశలో అగ్ర నాయకుల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఉపాధ్యాయ తెలిపారు. ఈ పదవిని చేపట్టిన తర్వాతకూడా వారి నుంచి నేర్చుకోవడానికి సంకోచించబోనని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు డా. హర్షవర్ధన్ మాట్లాడుతూ సతీష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యాయ నేతృత్వంలో పార్టీ మున్మందు మరిన్ని విజయాలను కైవసం చేసుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయకు అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించిందని, ఈ పదవిలో రాణిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కాగా సతీష్ ఉపాధ్యాయను రాష్ర్ట బీజేపీ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుఈ నెల తొమ్మిదో తేదీన ప్రకటించిన సంగతి విదితమే. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. హర్షవ ర్ధన్ కేంద్ర మంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్ష పదవిలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. కాగా సతీష్ ఉపాధ్యాయ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. అంతేకాకుండా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలకు ఉపాధ్యాయ ఇం దుకు సారథ్యం వహించాల్సి ఉంటుంది. మాల వీయనగర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఉపాధ్యాయ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్న సంగతి విదితమే.