తుమ్మలన్నా..! రా కదలిరా..!!
సత్తుపల్లి: ‘తుమ్మలన్నా..! రా కదలిరా..!! బంగారు తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం..’ ఇట్లు తుమ్మల అభిమానులు.. అంటూ సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి వెలసిన ఫ్లెక్సీలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆపార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల జరిగిన జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో తమ వర్గానికి ఆ పీఠం దక్కేందుకు తుమ్మల వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గడిపల్లి కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేలా చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలోనే కొనసాగుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఉన్నట్టుండి ఈ ఫ్లెక్సీలు వెలవడటం చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్లో చేరుతారనే...
తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం ఓవైపు సాగుతుండగానే ఆయన అనుచరులు కూడా పార్టీని వీడేందుకు గ్రామగ్రామాన సమాలోచనలు జరుపుతున్న నేపథ్యంలోనే ఫ్లెక్సీలు వెలువడటం చర్చనీయాంశమైంది. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. ఫ్లెక్సీలను పరిశీలించేందుకు పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు ఆసక్తి కనబర్చారు.
తుమ్మల వర్గీయుల కదలికలపై ‘జలగం’ వర్గం కన్ను...
తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల కదలికలపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు వర్గీయులు కన్నేశారు. ఎవరెవరూ తుమ్మలతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు..? ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఎలాంటి రాజకీయం ఉంది..? ఫోటోలు తీసి జలగం వెంకటరావుకు పంపించినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కావటంతో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం
‘పార్టీ పుట్టినప్పటి నుంచి వివిధ హోదాలలో.. పదవుల్లో పని చేశాం. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి?’ అంటూ టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి.
తుమ్మల నాగేశ్వరరావుకు ఈ నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గంతో పాటు ఎందరో అనుచరులు ఉన్నారు. తుమ్మలతో కలిసి నడుస్తామని ఇప్పటికే కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ‘సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో ఐదేళ్లు కలిసి పనిచేశాం. మాకు ఎక్కడా చిన్నపాటి పొరపచ్చలు కూడా రాలేదు.. పార్టీని వీడి వెళ్లాలంటే కష్టంగా ఉంది. అయినా సండ్ర వెంకటవీరయ్యతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం’ అని మరికొందరు ముఖ్యనాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.