గిరిపై దీక్షాధారి
ఘనంగా సత్యదీక్షలు ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా 1200 మంది దీక్ష
ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే 500 మంది
దేవస్థానంలో సత్య స్వాములను
పట్టించుకోవడం లేదని విమర్శలు
అన్నవరం :
సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున స్వామివారి సన్నిధిలో సత్యదీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే స్వామివారి జన్మనక్షత్రం నుంచి కార్తీకమాసంలో వచ్చే జన్మనక్షత్రం వరకూ 27 రోజుల పాటు సత్యదీక్షలను అన్నవరం దేవస్థానంలో అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ దీక్షలను జిల్లావ్యాప్తంగా సుమారు 1200 మందికి పైగా భక్తులు స్వీకరించారు. అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 350 మంది భక్తులు పసుపు వస్రా్తలు ధరించి ‘నమో సత్యదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఆలయ ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు చేతుల మీదుగా స్వామివారి సన్నిధిలో సత్యదీక్ష మాలలు ధరించారు. అదే సమయంలో కొండదిగువన గల వినాయకుని ఆలయం, కనకదుర్గ ఆలయాల్లోనూ మరో 200 మంది వరకు భక్తులు మాలలు ధరించి ఈ దీక్షలు స్వీకరించారు.
ఏజెన్సీ ప్రాంతంలో..
జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అడ్డతీగల ఆధ్వర్యంలో మరో 500 మంది గిరిజనులు ఈ దీక్షలు చేపట్టినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈసారి విజయవాడ, తెనాలి ప్రాంతాల భక్తులు కూడా ఈ దీక్షలు చేపట్టారు. ఉదయం పది గంటలకు రామరాయ కళావేదికలో సత్యజ్యోతి వెలిగించి పండితులు పూజలు చేశారు. అనంతరం సత్యదీక్షా స్వాములు భజనలు చేశారు.
సత్యదీక్ష స్వాములకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల అసంతృప్తి
సత్యదీక్ష స్వాములకు దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు స్వాములు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో సత్యనికేత¯ŒS సత్రంలో సత్యస్వాములు పీఠం పెట్టుకునేందుకు గదులు ఉచితంగా ఇచ్చేవారు. ఈసారి అలా ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా అన్నదాన పథకం భోజనం విషయంలో స్వాములకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.