అమీర్ మీద కారాలు మిరియాలు!
మగోడు
అమీర్‌ఖాన్ టీవీ షో ‘సత్యమేవజయతే’ను తెగ విమర్శిస్తున్నాడు ‘సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్’ అధ్యక్షుడు రాజేష్ వహారియా. ఈ సంస్థ పురుషుల హక్కుల కోసం పనిచేస్తోంది. ఇంతకీ రాజేష్, అమీర్‌ను ఎందుకు విమర్శించాడు? ఆయన మాటల్లోనే చదువుదాం...
‘‘అమీర్‌ఖాన్ తన కార్యక్రమం పేరును ‘సత్యమేవజయతే’కు బదులుగా ‘అర్ధ-సత్యమేవజయతే’గా మార్చుకుంటే మంచిదే. ఇందులో సగమే నిజాలు. మిగతావన్నీ అబద్ధాలు, ఉత్తుత్తి కన్నీళ్లు మాత్రమే. ‘గృహహింస’ మీద ప్రసారం చేసిన ఎపిసోడ్లో....‘గృహహింస’ను ఎదుర్కొంటున్న ఒక్క పురుషుడి గురించి కూడా ప్రస్తావించలేదు. గృహహింస బాధితులంటే స్త్రీలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. గృహహింస బాధితుల్లో పురుషులు ఉండరా? స్త్రీల మీద గృహహింస జరుగుతున్నట్లుగా చెప్పిన గణాంక వివరాలన్నీ తప్పుల తడక. అమీర్ ఉటంకించిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’(ఎన్ఎఫ్హెచ్యస్) కావాలనే పురుషులను విస్మరించింది.’’
‘ఎన్ఎఫ్హెచ్యస్’ రిపోర్ట్ ప్రకారం...37 శాతం మంది స్త్రీలు జీవితంలో ఒక్కసారైనా గృహహింసను ఎదుర్కొంటున్నారని ఉంటే, అమీర్ దాన్ని 40 శాతం చేసి ప్రేక్షకుల సానుభూతి పొందే ప్రయత్నం చేశాడని, 27 శాతం మంది పురుషులు భార్య నుంచి విడాకులు తీసుకున్నా... బాధలు పడక తప్పడం లేదని, భార్య బంధువుల ద్వారామానసిక, భౌతికదాడులకు గురవుతున్నా...వాళ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదని రాజేష్, అమీర్ మీద ఘాటుగా కారాలు మిరియాలు నూరుతున్నాడు.