పీఆర్పీని పునరుద్ధరించే ఆలోచన లేదు: బండారు
పీఆర్పీని పునరుద్దరించే ఆలోచన చిరంజీవికి లేదని గతంలో పీఆర్పీ నాయకుడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే సీమాంద్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయమని ఆయన వెల్లడించారు. ఆంటోని కమిటీ ముందుకు వెళ్లాలా, వద్దా అనే విషయమై తామంతా చర్చించుకుంటున్నామని, ఆంటోని కమిటీ ముందుకు వెళ్లి, విభజన కుదరదని తెగేసి చెప్పాలనుకుంటున్నామని సత్యానందరావు చెప్పారు.
రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర సమస్యలు ఏర్పడుతాయని, అందుకే సమైక్య రాష్ట్రానికి ప్రత్యామ్నాయమే లేదని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం అవసరమైతే కేంద్ర మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీ నామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సత్యానందరావు తెలిపారు.