లండన్‌లో 'తాల్' ఉగాది ఉత్సవాలు
లండన్ :
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను లండన్‌లోని రెడ్ బ్రిడ్జ్ టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించింది. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది తెలుగు కుటంబాలతో కలిసి నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ ఉగాది వేడుకను జరుపుకున్నారు.
ఈ వేడుకలను తాల్ ఉగాది కన్వీనర్ శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. తాల్ కల్చరల్ సెంటర్ (టీసీసీ) లలో సంగీతం, నృత్య కళలను అభ్యసిస్తున్న చిన్నారుల నృత్యాలు, ఆటపాటలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. టీసీసీ సంగీత అధ్యాపకురాలు వీణా పాణి కీర్తనలు, జ్యోత్స్నల వయోలిన్ కచేరి, సిజ్జ్ మీనన్, అరుణి మాల నృత్య ప్రదర్శనలు, తాల్ యూత్ బృంద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్యగాయకులు గోపిక పూర్ణిమ, మల్లికార్జున వైవిధ్య భరితమైన పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. కమెడియన్లు అభి, అవినాష్‌లు తమ హాస్య ప్రదర్శనలు, అనుకరణలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమానికి సినీ నటి ప్రణీత, ఇల్ఫోర్డ్ ఎంపీ మైక్ గేప్స్, ఈస్ట్ హామ్ కౌన్సెలర్ పాల్ సతియానెసన్, భారత రాయబార కార్యాలయ అధికారి సౌమేంద్ర మహాపాత్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలను ప్రణీత అభినందించారు. లండన్‌లోని పిల్లలు తెలుగులో మాట్లాడటం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల, వైస్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి, ట్రస్టీలు మల్లేష్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, శ్రీవాస రావు కొర్నెపాటి, కిరణ్ కప్పెటలు ఈ వేడుకను విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు.
ఈ ఏడాది హేమ మాచెర్ల సంపాదకీయంతో వచ్చిన తాల్ వార్షిక పత్రిక 'మా తెలుగు'ను ఆవిష్కరించారు. ప్రతిఏటా తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)పేరిట నిర్వహించే క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాల్ ఉగాది 2017 ఆర్గనైజింగ్ టీం, ప్రేక్షకులు, కళాకారులు, వాలంటీర్లు, సహకరించిన ఇతర సంస్థలకు, ఆర్థికంగా సహకరించిన వ్యాపార సంస్థలకు తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల కృతజ్క్షతలు తెలిపారు.