ఎన్టీపీసీ సీఎస్ఆర్ కింద రూ.25 కోట్లు ఖర్చు
పొంగులేటి ప్రశ్నకు పియూష్ గోయల్ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కార్పొరేటు సామాజిక బాధ్యత కింద 2011-12 నుంచి 2014-15 వరకు రూ.18.88 కోట్లు, సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్ఆర్ కింద రూ.6.06 కోట్లు నిధులను వెచ్చించినట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ చెప్పారు.
సీఎస్ఆర్ నిధులను ఆయా ప్రాంతాల్లో విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు, సౌరవిద్యుత్ వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యశిక్షణ మహిళా సాధికారిత, గ్రామీణ క్రీడల ప్రోత్సాహం, వికలాంగుల సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాలు, హుద్‌హుద్ తుపాను సమయంలో పునరుద్ధరణ, పునరావాస పనులకు వినియోగించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీపీసీ సంస్థ సీఎస్ఆర్ నిధుల వినియోగంపై వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ బదులిచ్చారు.
హుద్‌హుద్ తుపాను వల్ల సింహాద్రి విద్యుత్ కేంద్రానికి సుమారు రూ.34 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. జాతీయ సోలార్ మిషన్‌పై ప్రపంచ వాణిజ్య సంస్థలో యూఎస్ ఫిర్యాదు చేసిన విషయమై ఎంపీ పొంగులేటి అడిగిన మరో ప్రశ్నకు భారత డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్‌మెంట్‌కు సంబంధించి జాతీయ సోలార్ మిషన్లోన నిబంధనలపై యూఎస్ ఫిర్యాదు చేసిందని మంత్రి అంగీకరించారు.