నాటీ శ్రీవారు... ‘స్మార్టు’ జోకులు!
మొన్నటి వరకూ నా దగ్గర ఏదో మామూలు మొబైల్ ఉండేది. కానీ నా పుట్టిన రోజున మా అమ్మాయి తన సేవింగ్స్ డబ్బుతో అదేదో ‘స్మార్ట్’ ఫోనట, టచ్ స్క్రీన్ అట... కొనిచ్చింది. దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్లూ, రకరకాల ఆప్స్, ఇంటర్నెట్టూ గట్రా గట్రా ఎట్సెట్రా ఉన్నాయట. కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి ఆ అప్లికేషన్స్ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నా. ఈలోపు మా శ్రీవారు జోకులతో తయారు.
‘‘ఏవోయ్... నీ కూతురు ఇచ్చింది కాబట్టి నువ్వంటే అన్నింటినీ వెదికి పెట్టే గూగుల్ ఉన్న కంప్యూటర్‌లాంటి మొబైల్ వాడుతున్నావ్. కానీ నాకది అక్కర్లేదు తెలుసా?’’ అన్నారు శ్రీవారు.
‘‘ఎందుకూ... మీ ప్రియమైన కొడుకు అలాందేమీ మీ బర్త్‌డేకు ఇవ్వలేదనా?’’ అంటూ ఆయన ధోరణిలోనే జవాబిచ్చా.
‘‘కాదు... పెళ్లాం అంటేనే సర్వజ్ఞురాలు. ఆమెకు ఈ లోకంలో తెలియనిదేదీ ఉండదు కదా. మొగుళ్లంటే ఏదీ తెలియని దేభ్యం గాళ్లు కాబట్టి పెళ్లాలు గూగుల్ ఉన్న ఫోన్ వాడతారు. కానీ గూగుల్ ఉన్న పెళ్లాం ఉన్న తర్వాత ఇక మొగుడికి అదెందుకు చెప్పు’’ అంటూ కొంటెగా నా మీద ఒక సెటైర్ వేశారు. అది ఆయన సొంత జోకేమీ కాదు. ఏదో మ్యాగజైన్లో చదివిందే. నన్ను ఉడికించడానికి చెప్పిన జోకే మళ్లీ చెప్పారాయన.
ఉపయోగించడం కొత్త కదా. అందుకే సరిగా ఏ బటన్ నొక్కాలో తెలియక... ‘‘ఇదేమిటో స్వామీ కాస్త ఇబ్బంది పెడుతోంది. కొన్ని కమాండ్స్ సరిగా తీసుకోవడం లేదు’’ అంటూ అమాయకంగా అన్నా. మళ్లీ ఆయన దీని అడ్వాంటేజీ కూడా తీసుకున్నారు.
‘‘అదేమన్నా నీ మొగుడా... నువ్వు ఇచ్చిన కమాండ్ ఏదైనా... నీ మనసెరిగి నడుచుకోడానికి. అది కంప్యూటర్ బేస్డ్ మొబైల్. పేరుకు మొబైల్ అయినా అది నడవదు కదా. అలాగే... నీ మట్టుకు నువ్వు నీకు ఇష్టమైన కమాండ్స్ ఇచ్చినా, అదేమీ నీ సొంత మొగుడు కాదు కాబట్టీ... నీ మాట వినాల్సిన అవసరం లేదు కాబట్టీ... అదలాగే ప్రవర్తిస్తుంటుంది. అదృష్టవంతురాలు’’ అంటూ మళ్లీ ఇంకో విసురు విసిరారు.
సరే... ఇలా జోకులేస్తుంటే కాసేపు చూశాను. మరికాసేపు భరించాను. ఇక అప్లికేషన్లూ, అవీ వద్దని నిర్ణయించుకుని నాకు తెలిసిన విద్యే కాబట్టీ... ఠక్కున బటన్ నొక్కేస్తే ఫొటో వచ్చేస్తుంది కాబట్టి కొన్ని సెల్ఫీలూ, కొన్ని ఫొటోలూ తీయడం మొదలుపెట్టా. ఒకటో రెండో మా ఆయనవీ తీద్దామని ప్రయత్నిస్తుండగా మళ్లీ శ్రీవారు నోరు చేసుకున్నారు.
‘‘ఏవోయ్... నా ఫొటోలు తీస్తున్నావ్... నేనంటే ఏవన్నా బోరు కొట్టిందా? పొరబాటున ఏ ‘క్వికర్’లోనో, ఏ ‘ఓఎల్ఎక్స్’లోనో నా ఫొటో పెట్టి, నన్ను అమ్మేయాలని ప్లాన్లూ గట్రా వేయడం లేదు కదా?’’ అన్నారు అల్లరి పట్టించే స్వరంతో.
‘‘అయినా ఏదో మీ ఆశ, అతి విశ్వాసమేగానీ... కొనేవారెవరైనా ఉంటారంటారా?’’ అన్నాను. అంతే... ఆ రోజు మా ఇంట మండినవి రెండు! ఒకటి గిన్నె కింది పొయ్యి, రెండోది ఆయన ఛాతీ కింది గుండె! చిత్రమేమిటంటే... వంట మాడలేదు. కానీ... ఆయన మనసు ఉడుకున్న మాడు వాసన మాత్రం నా మనసు నాసికకు తెలిసింది.
- వై!