శివాలయం కట్టించిన అక్బర్..!
జైపూర్ః భరత భూమి సర్వ మానవ సమానత్వానికి పెట్టింది పేరు. హిందూ ముస్లిం భాయి భాయి అన్న నానుడి... ఈ పుణ్యభూమిలో అనుచరణలోనే ఉంది. తీవ్రమైన మతాచారాలు, కుల తత్వాలు ఆచరించే రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి... మీరాబాయి భజనలు వినడానికి వెళ్లేవాడట. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్ని మతాలవారి ఆదరణను పొందారు. తమిళనాడు శ్రీరంగ దేవాలయం, భద్రాద్రి రాముని ఆలయాల్లో సన్నాయి వాయించేది ముస్లింలే. చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్నవాడినే దేముడు అంటాం. అదే జైపూర్ వాసికి అనుభవపూర్వకమైంది. చిన్ననాడు మసీదులో ప్రార్థనలతోపాటు.. సమీప దేవాలయంలోనూ పూజలు చేసిన అక్బర్ ఖాన్.. కష్టాలు తీరడంతో ఆ పరమేశ్వరుని భక్తుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఏకంగా దేవాలయ నిర్మాణానికి నడుం కట్టాడు. 'అల్లా కహో యా రామ్.. క్యా ఫరక్ పడ్తాహై' అంటూ అతడు మత సామరస్యాన్ని చాటి చెప్తున్నాడు.
తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు జైపూర్ వాసి అక్బర్ ఖాన్. ఆ పరమ శివుడే తన రక్షకుడుగా భావిస్తున్నాడు. అందుకే జైపూర్ లో శివాలయం కట్టించేందుకు పూనుకున్నాడు. మసీదులో ప్రార్థనలతోపాటు చిన్నతనంలో తన స్నేహితులతో అనేక దేవాలయాలను దర్శించిన అక్బర్.. కష్టాల్లో అల్లాకు ప్రార్థనలతోపాటు పూజలు కూడ చేసేవాడు. అదే భక్తితో ప్రస్తుతం 39 ఏళ్ళ అక్బర్ ఖాన్ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తాను నిర్మించిన ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేసే ముందు గణేశ హోమం, యజ్ఞ యాగాదులు నిర్వహించి, కైలాస యాత్ర, భజన కార్యక్రమాలు చేపట్టేందుకు రాజస్థాన్ లోని టాంక్ టౌన్ లో ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాలను కూడ అక్బర్ ఖాన్ ఏర్పాటు చేశాడు. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు కష్టం అనిపించినా శివుడ్ని తల్చుకుంటానని, వెంటనే కష్టాలు అదృశ్యమౌతాయని ఖాన్ చెప్తున్నాడు. పరమశివుడ్ని ప్రార్థించిన తర్వాతే తన జీవితంలో ఆనందం వెలుగు చూసిందని వెల్లడించాడు.
ఓమ్ విహార్ కాలనీలోని వంద చదరపు మీటర్ల స్థలంలో భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం నిర్మించిన ఖాన్...ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతోపాటు.. వినాయకుడు, కుమారస్వామి ప్రతిమలను కూడ స్థాపించాడు. నన్ను భక్తుడుగా మార్చుకొని, నా కష్టాలను తీర్చిన పరమేశ్వరుడికి.. చంద్రుడికో నూలు పోగులా ఆలయ నిర్మాణం చేపట్టి... నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఖాన్ చెప్తున్నాడు. ఎవరివద్దా ఎటువంటి విరాళాలు, ఆర్థిక సాయం సేకరించకుండానే గుడి నిర్మాణం చేపట్టానని, ఇప్పటి వరకూ ఓమ్ విహార్ కాలనీలో ఆలయం లేకపోవడంతో ఇక్కడ నిర్మించానని చెప్తున్నాడు. అయితే ఆలయ నిర్మాణ విషయంలో సమాజంనుంచీ, స్వంత కమ్యూనిటీ నుంచి కూడ ఎటువంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదని అక్బర్ ఖాన్ చెప్తున్నాడు. అల్లా అని పిలిచినా, రామ్ అన్నా ఒక్కటేనని, ఏ మతస్థులైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అవసరమన్న స్పష్టమైన సందేశాన్ని ఆలయ నిర్మాణంతో ప్రజలకు ఇవ్వాలనుకున్నానని ఖాన్ తెలిపాడు. ఈ నూతన శివాలయం ఏప్రిల్ 30న ప్రారంభమై భక్తులకు అందుబాటులోకి వస్తుందని అక్బర్ వెల్లడించాడు.