భార్యపై కత్తితో దాడిచేసిన భర్త అరెస్ట్
హైదరాబాద్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన భర్తను రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన సయ్యద్ అంజద్(35), గౌసియా బేగం(30)లు దంపతులు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. హోటళ్లల్లో పని చేస్తూ సయ్యద్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరగడంతో అంజద్ పలుమార్లు భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గత నాలుగు నెలలుగా భార్యభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో వేరుగా ఉంటున్నారు. ఈ నెల 5వ తేదీన గౌసియా బేగం యాకుత్‌పురా ఇమామ్‌బడా ఆషూర్ఖానా వద్ద నివాసముండే సోదరి పర్వీన్ బేగం ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన అంజద్ భార్యతో గొడవ పడి కత్తితో దాడి చేశాడు.
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌసియా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన దాడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సయ్యద్ అంజద్‌ను బుధవారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.