సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
నల్లగొండ(మిర్యాలగూడ): నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం కె.చంద్రశేఖర్ రావు దిష్టిబొమ్మను మున్సిపల్ కార్మికులు దహనం చేశారు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నిన్న సీఎం ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసినందుకు నిరసనగా ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు.
గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామని టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు రాయికింది సైదులు, సీపీఎం డివిజన్ నాయకుడు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం దామరచర్ల రాష్ట్ర రహదారిపై కార్మికులు రాస్తారోకో జరిపిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నారన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు గత 39 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం తగదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కోట్యానాయక్, మాన్యానాయక్, బంటు రాము,సీపీఎం నాయకులు బి.కోటిరెడ్డి, దయానంద్, కార్మిక సంఘం నాయకులు నాగయ్య, జహరొద్దీన్, కొండలు తదితరులు పాల్గొన్నారు.