చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..?
చేతులతో మలం ఎత్తే పనులు(Manual Scavenging)పై 10 ఏళ్ల క్రితమే నిషేధం విధించినప్పటికీ నేటికీ ఈ పనులను చాలామంది చేస్తూనే ఉన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్‌ట్యాంకులు క్లీన్ చేసే నేపధ్యంలో ప్రతీయేటా చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. గడచిన ఐదేళ్లలో దేశంలో మ్తొతం 339 మంది కార్మికులు మృతిచెందారు. మురుగు కాలువలు శుభ్రంచేసే సమయంలో నేఫ్టీ డివైజెస్ ఉపయోగిస్తూ, పనులలోకి దిగాలనే అంశంపై చట్టం చేసినప్పటికీ, ఇటువంటి మరణాలు ఆగడం లేదు.
మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనం ఇదే..
2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చేతులతో మాలాన్ని ఎత్తే పనులపై ఎంప్లాయిమెంట్ ప్రొహిబిషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో దాని నిర్వచనాన్ని కూడా తెలియజేసింది. ఆ నిర్వచనం ప్రకారం ‘మాన్యువల్ స్కావెంజింగ్ పని చేయడానికి, మురికిని తీసి, శుభ్రం చేయడానికి, బహిరంగ కాలువలు లేదా గుంతలను శుభ్రం చేయడానికి, మానవ విసర్జనను సేకరించడానికి స్థానిక అధికారాన్ని పొందిన వ్యక్తిని ‘మాన్యువల్ స్కావెంజర్’ అని అంటారు.
ఈ వ్యాధుల బారిన పడుతూ..
భారతదేశంలోని దశాబ్దాల నాటి కుల వ్యవస్థ కారణంగా ఇటువంటి పనులను కుల వ్యవస్థలోని అట్టడుగున ఉన్న వర్గాలవారే చేస్తూ వస్తున్నారు. మానవ మలమూత్రాలను చేతితో శుభ్రం చేయడం, వాటిని దూరంగా ఎక్కడికైనా విసిరేయడం వల్ల ఇలాంటి క్లీనింగ్ కార్మికులు కలరా, హెపటైటిస్, టీబీ, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ 339 మంది మరణించారు. 2022లో 66 మంది, 2023లో 9 మంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వం చెబుతోంది.
చట్టంలో ఏముంది?
మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని నిర్మూలించేందుకు 1993లో భారతదేశంలో మొదటిసారిగా చట్టాన్ని ఆమోదించారు. 2013లో మరోసారి దీనికి సవరణ చేశారు. మొదటిసారిగా రూపొందించిన చట్టంలో డ్రై లెట్రిన్లలో పనిచేయడాన్ని నిషేధించారు. 2013లో తీసుకొచ్చిన చట్టంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనాన్ని తెలియజేశారు. సెప్టిక్ ట్యాంక్‌లను మాన్యువల్‌గా శుభ్రపరచడంతో పాటు రైల్వే ట్రాక్‌లను శుభ్రపరచడం కూడా ఈ చట్టంలో చేర్చారు.
రూ.10 లక్షల నష్టపరిహారం
2014, మార్చి 27న మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యపై సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించింది. మురుగునీటి క్లీనర్ల సమస్యను కూడా ఈ చట్టంలో చేర్చింది. ఎందుకంటే మురుగునీటి క్లీనర్లు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా మురుగు కాలువలను శుభ్రపరిచేటప్పుడు మానవ విసర్జనను కూడా వారు శుభ్రం చేయాల్సివస్తుంది. మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధన విధించింది. అయితే ఈ విధమైన నష్టపరిహారం, పునరావాసం కోసం ఎన్నో ఏళ్లుగా బాధిత కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిరావడం శోచనీయం.
ఇది కూడా చదవండి: 76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే