వైట్ హౌస్లో 'సైంటిస్ట్ బుడతడు'
వాషింగ్టన్: చిన్నవయసులోనే పెద్దగా ఆలోచన చేసి సొంత తెలివి తేటలతో ఓ అలారం గడియారాన్ని తయారు చేసిన ముస్లిం విద్యార్థి అహ్మద్ మహ్మద్ ఎట్టకేలకు వైట్ హౌస్లో కాలుపెట్టాడు. అతడి తెలివితేటలకు అబ్బురపడి వైట్ హౌస్ కు రావాలని పిలిచిన దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు అతడు కొంతమంది తన టీచర్లు సహా విద్యార్థులతో కలిసి వైట్ హౌస్లోకి గత రాత్రి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడికి మంచి స్వాగతం లభించింది.
ఈ ఏడాది గత రెండు నెలల కిందట తన టీచర్లను సంబ్రమాశ్చర్యాలకు గురిచేయాలనే ఉద్దేశంతో ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ తన సొంత తెలివితేటలతో ఓ అలారం గడియారాన్నితయారు చేసి దానినిపెట్టెలో పెట్టి తీసుకురాగా దానిని టీచర్లు బాంబుగా భ్రమపడ్డారు. అతడి మాటలు వినకుండానే పోలీసులకు పట్టించారు. ఆ తర్వాత అది హోమ్ మేడ్ అలారం గడియారం అని బయటకు తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వ్యాపించింది. దీంతో ఆ బాలుడి తెలివితేటలకు ముగ్గుడైన ఒబామా, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్.. అహ్మద్ ను ప్రశంసల్లో ముంచెత్తారు.
తనలాంటి బాల మేథావి, సైంటిస్టు దేశానికి అవసరం అని కితాబునిస్తూ తమను కలుసుకునేందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అహ్మద్ గతరాత్రి ఒబామా వద్దకు వెళ్లి గౌరవ మర్యాదలు స్వీకరించాడు. అయితే, అహ్మద్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఒబామా గత రాత్రి సందేశమిచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు యువతను మరింత ప్రోత్సాహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వారిపై పరిశీలన కలిగి ఉండి వారి నైపుణ్యాలను వృద్ధి చేస్తూ నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ చేయాలని అన్నారు.