పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్?
నగరి (చిత్తూరు) : పరీక్ష ఏదైనా లీకేజీ బాధ తప్పడం లేదు. తాజాగా శుక్రవారం పదో తరగతి సామాన్యశాస్త్రం-2 పేపర్ లీక్ అయిందనే వార్త హల్ చల్ చేసింది. చిత్తూరు జిల్లా నగరిలోని సరస్వతి పాఠశాల ఎదుట పదో తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నాపత్రం జిరాక్స్ తీస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. శుక్రవారం పదో తరగతి జీవశాస్త్రం పరీక్ష జరుగుతున్న సమయంలో కొందరు అదే ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్ తీస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.