science teacher
-
మా మంచి సైన్సు మాస్టార్
ఆయనో సైన్సు ఉపాధ్యాయుడు..ఉదయాన్నే పాఠశాలకు వచ్చి పిల్లలకు నాలుగు పాఠాలు చెప్పి తన పని అయిపోయిందనుకోలేదు. పిల్లల చేతిరాత శిక్షణ మొదలుకొని మూఢ నమ్మకాలపై అవగాహన, సమ్మర్ క్యాంపులు, సమాజంలోని రుగ్మతలపై నాటిక రచనలు, ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంటూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండపి: కొండపికి చెందిన లక్కంతోటి వరప్రసాద్ రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం తంగెళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్సు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. చేతిరాత..మన తలరాత.. చేతిరాత బాగుంటే మన తలరాత బాగుంటుందంటారు పెద్దలు. అందుకే వరప్రసాద్ విద్యార్థుల చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు చేతిరాత సక్రమంగా లేని 3 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాతను తీర్చిదిద్దారు. తాను పనిచేసిన పాఠశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సైతం సమ్మర్ క్యాంపులు పెట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు. నాటికల ద్వారా చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను బట్టబయలు చేసేలా ప్రజలకు కనువిప్పు కలిగేలా ఎయిడ్స్‌పై సమరం అంటూ నీ జీవితం–నీచేతిలోనే.. నాటికను రచించి పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్ శ్రీసత్యసాయి ఆడిటోరియంలో ఎయిడ్స్‌డే సందర్భంగా 2006 డిసెంబర్లో ప్రదర్శించారు. ఈ నాటికకు రచయితగా, డైరెక్టర్‌గా ప్రసాద్ యూనిసెఫ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. బేటిబచావో– బేటిపడావో కార్యక్రమంలో భాగంగా చదవనిద్దాం– ఎదగనిద్దాం అంటూ బాలికల విద్య గురించి ప్రకాశంజిల్లాలో ప్రథమస్థానం సాధించి, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంశాపత్రం అందుకున్నారు. బాలకార్మిక వ్యవస్థపై పోలీస్ బాబాయ్ శీర్షికన ఎన్టీఆర్ కళాపరిషత్‌లో 2010–11లో పిల్లలచేత వేయించిన నాటికకు రచయిత, దర్శకత్వం తదితర విభాగాల్లో మొత్తం 11 అవార్డులు అందుకున్నారు. అదే విధంగా వివిధ దినపత్రికల్లో ఆదివారం మ్యాగజైనన్లలో రచయితగా ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. క్రీడలకు ప్రోత్సాహం.. ప్రసాద్ చదువుకునే రోజుల్లో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహించి 1995లో బంగారు పతకం సాధించారు. క్రీడల పట్ల మక్కువతో ఏటా తాను పనిచేస్తున్న పాఠశాలల్లోని క్రీడాకారులకు రూ.15 వేలు ఖర్చు చేసి క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందిస్తూ వారి విద్యార్థిభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తోటి ఉపాధ్యాయులకు ప్రసాద్ ఆదర్శంగా నిలుస్తున్నారు. మ్యాజిక్ వెనుక లాజిక్.. సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు ఎన్నో. ఈ మూఢ నమ్మకాలకు విద్యార్థులను దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చిన్నారుల్లో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించేలా మ్యాజిక్ వెనుక లాజిక్ అంటు సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకు వస్తున్నారు. -
సైన్స్ టీచరే మా‘స్టార్’..
సాక్షి, హైదరాబాద్: మా‘స్టార్’ టీచర్ సైన్స్ ఉపాధ్యాయులే అని విద్యార్థులు చెబుతు న్నారు. హైదరాబాద్‌లో హైస్కూల్ స్థాయి విద్యార్థులపై నిర్వహించిన తాజా అధ్యయనంలో 30 శాతం మందికి సైన్సు మాస్టార్లంటేనే ఇష్టమని తెలపడం విశేషం. ఇక 48 శాతం విద్యార్థులకు టీచర్లు మంచి మిత్రులేనట. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు వారితో ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక 26 శాతం మందికి లెక్కల టీచర్లు అంటేనే ఇష్టమట. ఇక తెలుగు, ఆంగ్లం, హిందీ తదితర భాషలు బోధించే పండితులంటే 13 శాతం మందికి ఇష్టమని తెలిసింది. చివరగా మరో 12 శాతం మందికి సోషల్ టీచర్లంటేనే ఇష్టమని బ్రెయిన్లీ సంస్థ నగరంలో చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో సుమారు మూడువేల మంది హైస్కూల్ స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల అభిప్రాయాలు సేకరించగా వారి ఇష్టాఇష్టాలు, టీచర్లు–విద్యార్థుల మధ్యనున్న అనుబంధం వంటి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత విద్యావిధానంలో టీచింగ్ మెథడాలజీ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు.. క్లాస్‌వర్క్‌లు.. హోంవర్క్ వంటి విషయాల్లో బోధన, గైడెన్స్ బాగానే ఉన్నట్లు తేలింది. అయితే లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలు, దైనందిన జీవితంలో చిన్నారులకు పనికివచ్చే అంశాలు, బహిరంగ ప్రదేశాలు, విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే టీచర్లు కేవలం 24 శాతం మంది మాత్రమే ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించడం విశేషం. సందేహాల నివృత్తి ఇలా.. క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు అడిగే సందేహాలను విసుక్కోకుండా నివృత్తిచేసే ఉపాధ్యాయులు 48% మేర ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక రోజువారీగా తాము ఉపా ధ్యాయులను వివిధ అంశాలపై సందేహాలు అడుగు తున్నట్లు 37% విద్యార్థినీ విద్యార్థులు తెలిపారు. వారంలో కొన్నిసార్లు మాత్రమే తాము పలు అంశాలపై ఉపాధ్యాయులను సందేహాలు అడుగుతున్నామని మరో 29 శాతం మంది తెలిపారు. వారంలో కేవలం ఒకేసారి మాత్రమే తాము టీచర్లను డౌట్లు అడుగుతున్నట్లు 13 శాతం మంది విద్యార్థులు తెలపడం గమనార్హం. మొత్తంగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. లోకజ్ఞానం నేర్పేవారు అరకొరే.. బండెడు పుస్తకాలు, క్లాస్‌వర్క్‌లు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు, మార్కులు సరేసరి కానీ.. విద్యార్థులకు లోకజ్ఞానం నేర్పే ఉపాధ్యాయులు కేవలం 24 శాతం మంది మాత్రమేనని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. సబ్జెక్టులను బోధించడంలో చూపుతున్న శ్రద్ధ.. విద్యార్థులకు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి.. పరిసరాలను, ప్రకృతిని ఎలా పరిశీలించి విలువైన విషయాలను ఎలా గ్రహించాలి, ఇతరులతో, బహిరంగ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్న అంశాలను నేర్పేవారి శాతం కేవలం 24 శాతమేనని తేలింది. రోజురోజుకు ఇలాంటి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుండడం పట్ల ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 30%సైన్స్ టీచర్లంటే మక్కువ చూపిన విద్యార్థులు.. 26% లెక్కల మాస్టార్లంటే∙ఇష్టపడే వారు.. 13% చిన్నారులకు భాషా పండితులంటే ప్రేమ 12%సోషల్ టీచర్లు అంటే అభిమానంహైదరాబాద్‌లో బ్రెయిన్లీ సంస్థ అధ్యయనం -
చిన్నారిని బలికి టీచర్ యత్నం
ఉడాల్గురి(అస్సాం): ఒక ఉపాధ్యాయుడు, ఆయన కుటుంబం కలిసి తమ మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చేందుకు చేసిన యత్నాన్ని గ్రామస్తులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. ఈ ఘటన అస్సాంలోని ఉడాల్గురి జిల్లా గనక్పారలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లోంచి శనివారం ఉదయం దట్టమైన పొగ రావడం గ్రామస్తులు గమనించి, అప్రమత్తమయ్యారు. వారు వెళ్లి లోనికి చూడగా మహిళలు సహా ఇంట్లోని వారంతా నగ్నంగా కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. మధ్యలో మూడేళ్ల చిన్నారిని కూర్చోబెట్టారు. ఆమె మెడ నరికేందుకు ఓ మంత్రగాడు పెద్దకత్తిని పట్టుకుని ఉన్నాడు. విషయం తెల్సి పోలీసులురాగానే రాళ్లు, ఇతర వస్తువులను ఇంట్లోనివాళ్లు విసిరారు. పోలీసులు గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో టీచర్‌తోపాటు అతని కొడుకు గాయపడ్డారు. బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన బాలిక సదరు ఉపాధ్యాయుడి మరదలి కూతురనీ, ఆమె తల్లీ ఆ పూజల్లో పాల్గొందని సమాచారం. -
రెండు ఉద్యోగాలు సాధించిన నెమ్మికల్ వాసి
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి తన సత్తాచాటింది. గ్రామానికి చెందిన జటంగి సువర్ణ ఎంఎస్సీ, బీఈడీ చేసింది. అయితే గత ఏడాది జరిగిన గురుకుల సైన్స్ టీచర్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. అయితే ఆమె రాసిన రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం గమనార్హం. ఈమె 1నుంచి 12వ తరగతి వరకు నెమ్మికల్‌లో, డిగ్రీ సూర్యాపేటలో, ఎంఎస్సీ, బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది. గ్రామానికి చెందిన సువర్ణ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మాస్కూల్కు సైన్స్ టీచర్ కావాలి..
విశాఖపట్నం, రావికమతం: మా స్కూల్‌కు ఎన్ఎస్ టీచర్‌ను వేయాలని, ఉప విద్యాశాఖాధికారి ఆదేశాలను అమలు చేయాలంటూ మేడివాడ హైస్కూల్ విద్యార్థులు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. ఆ స్కూల్లో ఎన్ఎస్ టీచర్ లేరు. దీంతో పాఠశాలు బోధన జరగక పోవడంతో విద్యార్ధులంతా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో యలమంచిలి డిప్యూటి డిఈవో స్పందించారు. రావికమతం హైస్కూల్లో ముగ్గురు ఎన్ఎస్ టీచర్లు ఉన్నారు. విద్యార్థుల నిష్పత్తి కంటే ఒకరు అదనంగా ఉండడంతో ఒకరిని మేడివాడ స్కూల్‌కు డెప్యుటేషన్‌పై వేశారు. అయితే ఇప్పటికీ ముగ్గురిలో ఎవరూ కూడా అక్కడికి వెళ్లలేదు. దీంతో తరగతులు జరగక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు లేకుంటే తాము స్కూల్‌కు ఎందుకు వెళ్లాలని, పదో తరగతి ఎలా పాస్ కావాలంటూ విద్యాశాఖ కార్యాలయానికి వచ్చిన మేడివాడ విద్యార్థులు నినాదాలు చేశారు.డిప్యూటీ డీఈవో ఆదేశాలు పట్టించుకోరా అంటూ విద్యాశాఖాధికారి కె.అప్పారావును ప్రశ్నించారు. తక్షణం ఎన్ఎస్ టీచర్‌ను వేయాలని కోరారు. -
బడిని విడిచి.. బందూకు పట్టి విప్లవ గురువులు
కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి : అవి 1970 నాటి రోజులు.. పెద్దపల్లి డివిజన్లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాల.. అందులో ఓ సైన్స్ టీచర్.. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం.. ఏనాడూ ఎవరినీ దండించేవాడు కాదు.. తనకొచ్చే రూ.150 జీతంలో పేద పిల్లల పుస్తకాల కోసమే రూ.50 ఖర్చు చేసేవాడు.. సాయంత్రమైతే చాలు పిల్లలతో కలిసిపోయి ఫుట్‌బాల్ ఆడేవాడు.. ! విద్యార్థులపై ఏనాడూ బెత్తం ఎత్తని ఆ మాస్టారు సమసమాజ లక్ష్యం కోసం బందూకు ఎత్తాడు! సున్నిత మనస్కుడైన ఆ ఉపాధ్యాయుడే ఆయుధం చేతబట్టి అడవిబాట పట్టాడు. ఆయనెవరో కాదు.. దేశంలో మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు!! నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా అజ్ఞాతవాసం గడుపుతున్న ఈ ‘ఉపాధ్యాయుడి’ తలపై రూ.2 కోట్ల దాకా రివార్డు ఉంది. ఈయన ఒక్కరే కాదు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విప్లవ పంథా పట్టినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, వెంపటాపు సత్యం(కొండబారిడి మాస్టారు), పంచాతి కృష్ణమూర్తి, ఖాతా రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, ఆదిభట్ల కైలాసం, కనకాచారి, కోబడ్ గాంధీ, అరుణాగాంధీ, ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే తదితరులంతా ఈ కోవకు చెందినవారే. మొదటితరంలో టీచర్లు ఉద్యమ నాయకులైతే తర్వాతి తరంలో వారి కొడుకులు, వారి శిష్యులు ఇప్పుడు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తరగతి గదుల నుంచి తరలివెళ్లిన ఈ ‘విప్లవ’ ఉపాధ్యాయులపై మంగళవారం గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సున్నిత మనస్కుడు.. విప్లవ భావాలు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పెద్దపల్లి డివిజన్లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలలో 1972 నుంచి 1976 వరకు సైన్స్ టీచర్‌గా పని చేశారు. సున్నిత మనస్కుడని, పిల్లల కష్టాలు చూసి చలించిపోయేవాడని నాడు ఆయనతో కలసి పనిచేసిన టీచర్లు గుర్తుచేసుకుంటున్నారు. వచ్చే రూ.150 జీతంలో పేద విద్యార్థుల పుస్తకాలు, వారి అవసరాల కోసం రూ.50 ఖర్చు చేసేవారని, సాయంత్రం వేళ ఉచితంగా చదువు చెప్పేవారని పేర్కొంటున్నారు. ‘‘పిల్లలతో ఆయన ఏనాడూ కఠి నంగా మాట్లాడేవారు కాదు. ఏ విషయమైన ఓర్పుతో సున్నితంగా చెప్పేవారు. విద్యార్థుల కష్టాలు చూసి చలించేవారు. ఇతరుల సొమ్ము అణా పైసా కూడా ముట్టేవాడు కాదు. ఆయన భార్య తన తల్లిగారి ఇంటి నుంచి ఎప్పుడైన బియ్యం, పప్పులు వంటివి తెస్తే వాటిని కూడా వెనక్కి పంపేవాడు. నాడే విప్లవ భావాలు బయటపడ్డాయి. పాఠశాలలో మీటింగ్‌లు జరిగితే దొరలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లా డేవాడు..’’ అని నాడు గణపతితో కలసి టీచర్‌గా పనిచేసిన బోడ మల్లారెడ్డి చెప్పారు. మిగతా టీచర్లం తా పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ఉంటూ సైకిల్‌పై ఎలిగేడు వచ్చేవారని, లక్ష్మణ్‌రావు మాత్రం తమ ఊరిలోనే ఇల్లు కిరాయికి తీసుకొని ఉండేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. గణపతి అత్తగారి ఊరు పెద్దపల్లి మండలం రాగినేడు. ఈ ఊళ్లో దొరతనాన్ని ధిక్కరిస్తూ సాగిన కార్యకలాపాలకు గణపతి సారథ్యం వహించడం గమనార్హం. ఒక్కరా.. ఇద్దరా! ఉమ్మడి రాష్ట్రంలో 1965లో నక్సలిజానికి బీజం పడింది. పశ్చిమబెంగాల్లోని నక్సల్బరీ స్ఫూర్తితో శ్రీకాకుళాన్ని తాకిన ఈ ఉద్యమంలో ఎందరో ఉపాధ్యాయులు దూకారు. వెంపటాపు సత్యం, పంచాతి కృష్ణమూర్తి ఉపాధ్యాయ వృత్తిని వదిలి విప్లవబాట పట్టారు. 1976లో తెలంగాణ ప్రాంతంలో ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిల నాయకత్వంలో నక్సలైట్ కార్యకలాపాలు మొదలయ్యాయి. కొండపల్లి సీతారామయ్య హిందీ మాస్టారు కాగా సత్యమూర్తి తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. వెంపటాపు సత్యం 1962–63లో ఇప్పటి విజయనగరం జిల్లా కురుపాం మండలం కొండబారిడిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఖాతా రామచంద్రారెడ్డి తీగలకుంటపల్లిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తూనే అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యంలో ఉన్న మరో మావోయిస్టు నాయకుడు చంద్రశేఖర్ కూడా ఏటూరు నాగారం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. వీరితోపాటు కోబడ్ గాంధీ, అరుణాగాంధీ(వీరిద్దరూ ఢిల్లీలో ప్రొఫెసర్లు), ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే(గుంటూరు జిల్లాలో టీచర్‌గా), ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన లలితక్క(కోరుట్లలో టీచర్‌గా), కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రమేశన్న(సిరిసిల్లలో టీచర్‌గా) వంటి నేతలంతా ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు పాఠాలు బోధించినవారే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు విరసం నేత వరవరరావు, ఉద్యమంలో అమరులైన చెరబండ రాజు, బాలగోపాల్, ఆకుల భూమయ్య కూడా టీచర్లే కావడం గమనార్హం. సారు ఒక్క దెబ్బ కొట్టలేదు.. ఆ రోజుల్లో సార్లు బొర్లిచ్చి కొట్టేవారు. కోదండం ఎక్కించేవారు. లక్ష్మణ్‌రావు (గణపతి) సారు మాత్రం మమ్ముల్ని ఒక్కదెబ్బ కొట్టేవారు కాదు. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. ఎలిగేడులోనే ఉండి సాయంకాలం ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. మాతో కలసి ఫుట్‌బాల్ ఆడేవారు. – కట్ల అశోక్, స్కూల్లో గణపతి శిష్యుడు