బడిని విడిచి.. బందూకు పట్టి విప్లవ గురువులు
కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి : అవి 1970 నాటి రోజులు.. పెద్దపల్లి డివిజన్‌లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాల.. అందులో ఓ సైన్స్ టీచర్.. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం.. ఏనాడూ ఎవరినీ దండించేవాడు కాదు.. తనకొచ్చే రూ.150 జీతంలో పేద పిల్లల పుస్తకాల కోసమే రూ.50 ఖర్చు చేసేవాడు.. సాయంత్రమైతే చాలు పిల్లలతో కలిసిపోయి ఫుట్‌బాల్ ఆడేవాడు.. !
విద్యార్థులపై ఏనాడూ బెత్తం ఎత్తని ఆ మాస్టారు సమసమాజ లక్ష్యం కోసం బందూకు ఎత్తాడు! సున్నిత మనస్కుడైన ఆ ఉపాధ్యాయుడే ఆయుధం చేతబట్టి అడవిబాట పట్టాడు. ఆయనెవరో కాదు.. దేశంలో మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు!! నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా అజ్ఞాతవాసం గడుపుతున్న ఈ ‘ఉపాధ్యాయుడి’ తలపై రూ.2 కోట్ల దాకా రివార్డు ఉంది. ఈయన ఒక్కరే కాదు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విప్లవ పంథా పట్టినవారు పదుల సంఖ్యలో ఉన్నారు.
కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, వెంపటాపు సత్యం(కొండబారిడి మాస్టారు), పంచాతి కృష్ణమూర్తి, ఖాతా రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, ఆదిభట్ల కైలాసం, కనకాచారి, కోబడ్ గాంధీ, అరుణాగాంధీ, ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే తదితరులంతా ఈ కోవకు చెందినవారే. మొదటితరంలో టీచర్లు ఉద్యమ నాయకులైతే తర్వాతి తరంలో వారి కొడుకులు, వారి శిష్యులు ఇప్పుడు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తరగతి గదుల నుంచి తరలివెళ్లిన ఈ ‘విప్లవ’ ఉపాధ్యాయులపై మంగళవారం గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సున్నిత మనస్కుడు.. విప్లవ భావాలు
ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పెద్దపల్లి డివిజన్‌లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలలో 1972 నుంచి 1976 వరకు సైన్స్ టీచర్‌గా పని చేశారు. సున్నిత మనస్కుడని, పిల్లల కష్టాలు చూసి చలించిపోయేవాడని నాడు ఆయనతో కలసి పనిచేసిన టీచర్లు గుర్తుచేసుకుంటున్నారు. వచ్చే రూ.150 జీతంలో పేద విద్యార్థుల పుస్తకాలు, వారి అవసరాల కోసం రూ.50 ఖర్చు చేసేవారని, సాయంత్రం వేళ ఉచితంగా చదువు చెప్పేవారని పేర్కొంటున్నారు. ‘‘పిల్లలతో ఆయన ఏనాడూ కఠి నంగా మాట్లాడేవారు కాదు.
ఏ విషయమైన ఓర్పుతో సున్నితంగా చెప్పేవారు. విద్యార్థుల కష్టాలు చూసి చలించేవారు. ఇతరుల సొమ్ము అణా పైసా కూడా ముట్టేవాడు కాదు. ఆయన భార్య తన తల్లిగారి ఇంటి నుంచి ఎప్పుడైన బియ్యం, పప్పులు వంటివి తెస్తే వాటిని కూడా వెనక్కి పంపేవాడు. నాడే విప్లవ భావాలు బయటపడ్డాయి. పాఠశాలలో మీటింగ్‌లు జరిగితే దొరలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లా డేవాడు..’’ అని నాడు గణపతితో కలసి టీచర్‌గా పనిచేసిన బోడ మల్లారెడ్డి చెప్పారు. మిగతా టీచర్లం తా పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ఉంటూ సైకిల్‌పై ఎలిగేడు వచ్చేవారని, లక్ష్మణ్‌రావు మాత్రం తమ ఊరిలోనే ఇల్లు కిరాయికి తీసుకొని ఉండేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. గణపతి అత్తగారి ఊరు పెద్దపల్లి మండలం రాగినేడు. ఈ ఊళ్లో దొరతనాన్ని ధిక్కరిస్తూ సాగిన కార్యకలాపాలకు గణపతి సారథ్యం వహించడం గమనార్హం.
ఒక్కరా.. ఇద్దరా!
ఉమ్మడి రాష్ట్రంలో 1965లో నక్సలిజానికి బీజం పడింది. పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ స్ఫూర్తితో శ్రీకాకుళాన్ని తాకిన ఈ ఉద్యమంలో ఎందరో ఉపాధ్యాయులు దూకారు. వెంపటాపు సత్యం, పంచాతి కృష్ణమూర్తి ఉపాధ్యాయ వృత్తిని వదిలి విప్లవబాట పట్టారు. 1976లో తెలంగాణ ప్రాంతంలో ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిల నాయకత్వంలో నక్సలైట్ కార్యకలాపాలు మొదలయ్యాయి.
కొండపల్లి సీతారామయ్య హిందీ మాస్టారు కాగా సత్యమూర్తి తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. వెంపటాపు సత్యం 1962–63లో ఇప్పటి విజయనగరం జిల్లా కురుపాం మండలం కొండబారిడిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఖాతా రామచంద్రారెడ్డి తీగలకుంటపల్లిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తూనే అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యంలో ఉన్న మరో మావోయిస్టు నాయకుడు చంద్రశేఖర్ కూడా ఏటూరు నాగారం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
వీరితోపాటు కోబడ్ గాంధీ, అరుణాగాంధీ(వీరిద్దరూ ఢిల్లీలో ప్రొఫెసర్లు), ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే(గుంటూరు జిల్లాలో టీచర్‌గా), ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన లలితక్క(కోరుట్లలో టీచర్‌గా), కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రమేశన్న(సిరిసిల్లలో టీచర్‌గా) వంటి నేతలంతా ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు పాఠాలు బోధించినవారే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు విరసం నేత వరవరరావు, ఉద్యమంలో అమరులైన చెరబండ రాజు, బాలగోపాల్, ఆకుల భూమయ్య కూడా టీచర్లే కావడం గమనార్హం.
సారు ఒక్క దెబ్బ కొట్టలేదు..
ఆ రోజుల్లో సార్లు బొర్లిచ్చి కొట్టేవారు. కోదండం ఎక్కించేవారు. లక్ష్మణ్‌రావు (గణపతి) సారు మాత్రం మమ్ముల్ని ఒక్కదెబ్బ కొట్టేవారు కాదు. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. ఎలిగేడులోనే ఉండి సాయంకాలం ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు.
మాతో కలసి ఫుట్‌బాల్ ఆడేవారు. – కట్ల అశోక్, స్కూల్‌లో గణపతి శిష్యుడు