ప్రఖ్యాత శాస్త్రవేత్త యశ్ పాల్ కన్నుమూత
నోయిడా: ప్రఖ్యాత శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మాజీ అధ్యక్షుడు ప్రొ. యశ్ పాల్ (90) కన్నుమూశారు. నోయిడాలోని తన నివాసంలో నిన్న (సోమవారం) ఆయన మరణించారు. కొన్నేళ్ల క్రితం యశ్పాల్ క్యాన్సర్ బారిన పడి అనంతరం చికిత్స ద్వారా కోలుకున్నారు. యశ్ పాల్ 1926లో పాకిస్తాన్‌లోని ఝాంగ్లో జన్మించారు. హర్యానాలోని పాయ్లో పెరిగిన ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
అలాగే 1958 లో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ డిగ్రీ పొందారు. పాల్ విజ్ఞాన రంగం, కాస్మిక్ కిరణాల అధ్యయనం, అధిక శక్తి భౌతిక శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం మరియు అభివృద్ధిపై గణనీయమైన కృషి చేశారు. ఆయన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 1976లో పద్మభూషణ్, 2013లో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేసింది. యశ్ పాల్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం జరగనున్నాయిన.