స్కోలియోసిస్ అంటే ఏమిటి?
మా అబ్బాయికి ఆరేళ్లు. వాడికి వెన్ను కాస్త వంకరగా ఉందేమో అనిపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. డాక్టర్‌గారు మావాడిని చూసి, కొద్దిపాటి సమస్య ఉందని, దాని పేరు స్కోలియోసిస్ అని నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి చికిత్స ఏమీ అవసరం లేదని అన్నారు. వాడికి ఇతరత్రా సమస్యలు ఏమీ లేవు. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? అది మున్ముందు ఏమైనా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందా?
- మాణిక్యప్రసాద్, చిత్తూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి స్కోలియోసిస్ అనే సమస్య ఉన్నట్లు చెప్పవచ్చు. ఇది వెన్నెముకకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన సమస్య (స్పైనల్ డిఫార్మిటీ). ఇది వెన్ను మొత్తంలో ఎక్కడైనా రావచ్చు. ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చే సమస్యలు... ముఖ్యంగా వెన్నుపూసల అమరికలో తేడాలు ఉన్నప్పుడు, నరాలతోపాటు కండరాల సమస్య ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కండరాల సమస్యలు ఉన్నప్పుడు, వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు, అలాగే రెండు కాళ్ల పొడవులో తేడాలు ఉండటం వల్ల, పుట్టుకతో వచ్చే (కంజెనిటల్) కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపించవచ్చు. మరికొందరిలో ఇది కొన్ని జన్యుపరమైన సమస్యలతో అనుబంధంగా కూడా ఉండవచ్చు. లేదా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా (ఇడియోపథిక్గా) కూడా ఈ సమస్య కనిపించవచ్చు.
ఇలాంటి రోగుల్లో ఇది నడకలో మార్పులు, ఛాతీ అమరికలో తేడాలు (ఛెస్ట్ డిఫార్మిటీ), నిల్చునే పద్ధతిలో మార్పుల వంటి చిన్నపాటి సమస్యలతో బయటపడుతుంది.
ఎక్స్-రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా దీని తీవ్రతను పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు. చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్య కనిపించినప్పుడు విపులమైన నరాలకు సంబంధించిన పరీక్షలు (డీటెయిల్డ్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్) చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది బయటకు కనిపించకుండా ఉన్న కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలకు సూచిక అయి ఉండవచ్చు.
ఇక చికిత్స విషయానికి వస్తే దీనికి కారణాలు తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం చేయడం ముఖ్యం. ఈ పిల్లలకు చికిత్స అన్నది వారి వయసుపైనా, వెన్ను వంకరలోని తీవ్రత (డిగ్రీ ఆఫ్ కర్వేచర్) మీద ఆధారపడి ఉంటుంది. బ్రేసింగ్, శస్త్రచికిత్స ప్రక్రిల ద్వారా ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా, ఇతరత్రా కాంప్లికేషన్లకు దారితీయకుండా కాపాడవచ్చు. ఈ సమస్య వల్ల చిన్నపిల్లల్లో వారి వారి దైనందిన చర్యలకు ఇబ్బంది కలుగుతుంటే బ్రేసింగ్ వల్ల, అది మరింత పెరగకుండా ఆపడంతో పాటు, ఉపశమనం కూడా కలిగించవచ్చు. అయితే వెన్ను వంకర మరింత తీవ్రమవుతూ పోతుంటే (డిగ్రీ ఆఫ్ యాంగులేషన్ ఎక్కువగా ఉంటే) తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇక చాలా తీవ్రమైన స్కోలియోసిస్ ఉన్నప్పుడు అది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. అలాగే కొన్నిసార్లు గుండె పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు.
మీ అబ్బాయికి ఇడియోపథిక్ జువెనైల్ స్కోలియోసిస్ అనే కండిషన్ ఉండవచ్చు. అయితే ఈ కండిషన్లో ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు ఏమీ లేవని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి పిల్లలు తప్పనిసరిగా ఆర్థోపెడిక్ లేదా స్పైన్ సర్జన్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఫాలో-అప్‌లో ఉండటం చాలా అవసరం.
ఎందుకంటే వాళ్లలో రుగ్మత తీవ్రత పెరుగుతూ పోతుందేమో అని పరిశీలిస్తూ, దాన్ని బట్టి సరైన సమయంలో సరైన చికిత్సకు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీరు ఒకసారి మీకు దగ్గర్లోని స్పైన్ సర్జన్‌తో పాటు పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, వారి ఫాలోఅప్‌లో ఉండటం తప్పనిసరి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్