యాపిల్ స్టోర్ కి చైనా ఝలక్!
హుందాకు ప్రతీకగా భావించే ఐ- ఫోన్లను తయారు చేసే యాపిల్ సంస్థకు.. చైనా మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఝలక్ ఇచ్చింది. యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్స్ ను ఉపయోగించి.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. దీంతో యాపిల్ కంపెనీ.. తన స్టోర్స్ నుంచి భారీ స్థాయిలో యాప్స్ తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది.
యాపిల్ హాండ్ సెట్ లో రహస్యంగా అమర్చిన కిట్ ద్వారా.. చైనాకు చెందిన మొబైల్ అడ్వర్టైజింగ్ ప్రొవైడర్ యూమీ యూజర్ ఐడీలు, మెయిల్ అడ్రస్ లు, డివైజ్ ఐడీలు, సర్వర్ కంపెనీ నుంచి ఇంటర్నెట్ రూట్ అయిన డేటా వంటి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తాము గుర్తించామని యాపిల్ వర్గాలు వివరించాయి.
దీంతో యాపిల్ స్టోర్ లోని 250కి పైగా ఎస్డీకే యాప్ లను తొలగించారు. దీంతో పాటు భవిష్యత్ లో కూడా ఎస్డీకే అప్లికేషన్లను అనుమతించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. తొలగించిన అప్లికేషన్స్ స్థానంలో అతి త్వరలో అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందించేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నారని.. వీటిని త్వరలోనే రీప్లేస్ చేస్తామని ప్రకటించింది.
తమ స్టోర్ నుంచి అనధికారికంగా.. డేటాను వాడుకోవడం.. యూజర్ల వ్యక్తిగత వివరాలు సేకరించడం.. చట్టరీత్యా నేరమని.. ఇది కంపెనీ లీగల్, ప్రైవసీ ఒప్పందాలను ఉల్లంఘించడమే అని యాపిల్ స్పష్టం చేసింది. త్వరలోనే చైనా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నామని తెలిపింది.