పైరేట్స్ ఆఫ్ ది వరల్డ్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సముద్రపు దొంగల బెడద
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఇటీవల కొన్నేళ్లుగా సముద్రపు దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల అపహరణ, సిబ్బంది నిర్బంధం, సరుకుల దోపిడీ, దాడుల వార్తలు మళ్లీ నిత్యకృత్యంగా మారాయి. ప్రత్యేకించి ఈ నెల ఒకటో తేదీన భారతదేశానికి చెందిన సరుకుల నౌక మాందావిని పైరేట్లు అపహరించి, అందులోని 11 మంది సిబ్బందిని నిర్బంధించిన విషయం తెలిసిందే.
ఆ నౌక దుబాయ్ నుంచి యెమెన్ అల్ ముకాలా రేవుకు వెళుతుండగా సోమాలియా సమీపంలోని హోబ్యో వద్ద పైరేట్లు దాడి చేశారు. గత నెలలో ఏరిస్ 13 అనే చమురు నౌకను పుంట్లాండ్ తీరం నుంచి పైరేట్లు అపహరించుకుపోయారు. తాజాగా.. ఏడెన్ తీరంలో ఒక చైనా నౌకను పైరేట్ల దాడి నుంచి బయటపడటానికి భారత నౌకాదళ సిబ్బంది సాయం చేశారు. ఈ సముద్రపు దోపిడీలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఈ ప్రమాదం విస్తరిస్తోంది.
పైరేట్ల ముప్పు తీవ్రంగా ఉన్న పది ప్రాంతాలివీ...
► మలక్కా జలసంధి: హిందూ మహాసముద్రంలో ఉన్న మలక్కా జలసంధి వద్ద పైరేట్ల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఇది భారత్ – చైనా సముద్రయాన మార్గాల్లో చాలా ముఖ్యమైనదే కాదు.. సూయిజ్ కెనాల్, ఈజిప్ట్, యూరప్‌ల వాణిజ్యయాన గవాక్షం కూడా.
► దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రంలో మలేసియన్లు, ఇండోనేసియన్లు పైరసీకి పాల్ప డుతున్నారు. వారిని అత్యంత ప్రమాదకరమైన వారిగా పరిగణిస్తారు. మలేసియా జలాల్లో ప్రధానంగా దోపిడీలు జరుగుతుండటం ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది.
► ఏడెన్ సింధుశాఖ: ఎర్ర సముద్రానికి గవాక్షమైన ఏడెన్ సింధుశాఖలో కూడా పైరేట్ల బెడద చాలా ఎక్కువ. సూయిజ్ కెనాల్‌కు దారితీసే ముఖ్యమైన వాణిజ్య మార్గంలో ఉన్న ప్రాంతమిది. భౌగోళికంగా సోమాలియాకు దగ్గరగా ఉండటంతో ఆ దేశపు పైరేట్లు ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు.
► గినియా సింధుశాఖ: వాయవ్య – దక్షిణ ఆఫ్రికా (అంగోలా)లో చాలా భాగం విస్తరించి ఉన్న గినియా సింధుశాఖ యూరప్ దేశాలు, అమెరికా దేశాలకు చమురు రవాణా చేసే చాలా ముఖ్యమైన మార్గం. దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే నౌకలపై పైరేట్ల ఆగడాలు పెరుగుతున్నాయి.
► బెనిన్: ఆఫ్రికాలోని బెనిన్ ప్రాంతం కూడా సముద్రపు దొంగల దాడుల ప్రమాదం ఎక్కువగా ఉండే జాబితాలో చేరింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థలు ఇక్కడ పైరసీని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నా ఇంతవరకూ సానుకూల ఫలితాలు కనిపించలేదు.
► నైజీరియా: ఆఫ్రికా పశ్చిమ ప్రాంతాన గల నైజీరియాను.. సముద్రపు దొంగల దాడులకు మరో కేంద్రంగా పరిగణిస్తున్నారు. దీనిని సముద్ర వాణిజ్య రవాణాకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా జాబితాలో చేర్చారు. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి సరుకుల రవాణా చేయాలంటే.. ఆ సరుకులకు బీమా కవరేజీ చాలా ఎక్కువగా చేయించాల్సిన పరిస్థితి.
► సోమాలియా: సోమాలియాలో సముద్రపు దోపిడీలు అత్యధికం. ఈ దేశంలో అంతర్యుద్ధం, ప్రభుత్వ అసమర్థతల వల్ల ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుండటంతో పాటు సోమాలియా సముద్ర జలాల్లో సముద్ర వ్యర్థాలు భారీ స్థాయిలో ఉండటం కూడా ఇక్కడ పైరసీ భారీగా ఉంటోంది. ఈ మార్గం గుండా ప్రయాణించే సరుకులకు బీమా చేయడానికి కూడా భారీ మొత్తం చెల్లించాల్సిందే.
► ఇండోనేసియా: ఇండోనేసియాలో కూడా పైరసీ అధికంగా ఉంది. అనాంబాస్, నాటునా, మెరుండుంగ్ తదితర దీవులను పైరేట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడ రాత్రి పూట దాడులు చేయడం ఎక్కువ.
► అరేబియా సముద్రం: అరేబియా సముద్రంలోని ఒమన్ సింధుశాఖ వద్ద పైరేట్ల తాకిడి ఎక్కువ. ఏడెన్ సింధుశాఖ, సోమాలీ తీరాలతో పోలిస్తే ఇక్కడ అంతర్జాతీయ సముద్ర సంస్థలు కల్పించే భద్రత తక్కువ కావడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. ► హిందూ మహాసముద్రం: సోమాలియా పైరేట్లు హిందూ మహాసముద్ర జలాల్లో దాడులకు పాల్పడుతున్నారు. సరకు నౌకలకు ఇది ప్రధానమార్గం కావడంతో.. ముఖ్యంగా భారతదేశపు నౌకలు, ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ఇతర దేశాల నౌకలనూ లక్ష్యంగా చేసుకుంటున్నారు.