1.13 లక్షల కోట్ల సంపదను కనుగొన్నారు..!
300 ఏళ్ల క్రితం కరీబియన్ సముద్రంలో మునిగిన స్పానిష్ నౌకను కొలంబియా గుర్తించింది. ఇందులో బంగారం, వెండి, రత్నాలతో కూడిన దాదాపు 1.13 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద బయటపడింది. కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుల్ శాంటోస్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'శుభవార్త. శాన్ జోస్ నౌకను మనం గుర్తించాం' అని శాంటోస్ ట్వీట్ చేశారు. సముద్రంలో అన్వేషణ బృందంతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. 1708లో జరిగిన యుధ్దంలో బ్రిటిష్ యుద్ధ నౌకలు.. శాన్ జోస్ నౌకను ధ్వంసం చేశాయి.
కొలంబియా తీరంలో బయటపడిన ఈ సంపదపై అంతర్జాతీయ వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. శాన్ జోస్ కోసం అమెరికాకు చెందిన సీ సర్చ్ ఆర్మడా అనే సంస్ధ చాలా సంవత్సరాల నుంచి అన్వేషిస్తోంది. సముద్రంలో శాన్ జోస్ ఉన్న ప్రాంతాన్ని 1981లో కనుగొన్నామని ఎస్ఎస్ఏ వెల్లడించింది. ఎస్ఎస్ఏ గుర్తించిన సముద్ర ప్రాంతంలోకి కొలంబియా ప్రభుత్వం అక్రమంగా జొరబడిందని ఆరోపించింది.
శాన్ జోస్ నౌకలో ఉన్న సంపద ఎవరికి చెందాలన్న విషయంపై న్యాయ పోరాటం నడుస్తోంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే దీనిపై అమెరికా, కొలంబియా కోర్టుల్లో దావా వేసింది. సంపదను ఎస్ఎస్ఏకు, కొలంబియా ప్రభుత్వానికి చెరో 50 శాతం పంచాలని బరాన్క్విలా సర్క్యూట్ కోర్టు తీర్పు చెప్పినట్టు ఎస్ఎస్ఏ చెబుతోంది. కొలంబియా సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పును సమర్థించినట్టు వెల్లడించింది. సంపదలో 35 శాతం ఇస్తామని, నౌక మునిగివున్న సముద్ర అంతర్భాగంలోకి అమెరికన్లను వెళ్లకుండా చూడాలన్న 1984 ఒప్పందాన్ని కొలంబియా ఉల్లంఘించిందని ఎస్ఎస్ఏ ఆరోపించింది. సంపద విలువ 4 నుంచి 17 బిలియన్ల డాలర్లు ఉండవచ్చని, అయితే కచ్చితంగా ఎంత విలువ చేస్తుందన్న విషయం ఎవరికీ తెలియదని ఎస్ఎస్ఏ పేర్కొంది. కాగా కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి మరియన కొర్డొబో మాట్లాడుతూ.. కోర్టు తీర్పులన్నీ తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పారు. ఇంతకీ ఈ సంపద ఎవరికి చెందుతుందో?