ఔరా.. హుద్‌హుద్!
* సముద్ర ఉష్ణోగ్రతల్లో అరుదైన మార్పులు
* బలహీనపడడానికి బదులు శక్తిమంతం
* ఎన్ఐవో శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: విశాఖతో పాటు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాను ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో అనూహ్య పరిణామాలను సంతరించుకున్నట్లు వెల్లడవుతోంది. సాధారణ పరిస్థితులకు భిన్నంగా ప్రతాపం చూపి శాస్త్రవేత్తలకు సరికొత్త సవాల్ విసిరి, వారిని ఆలోచనల్లో పడేసింది. అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను విశాఖ సమీపంలో తీరాన్ని దాటింది. తుపాన్లు తీరం దాటే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు అది పయనించే మార్గం (సైక్లోన్ ట్రాక్)లో ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా తీవ్ర వాయుగుండంగా మారినప్పుడు సైక్లోన్ ట్రాక్‌లో సముద్ర జలాలు చల్లబడతాయి.
ఉష్ణోగ్రతలు పెరిగితే తుపాను తీవ్రత కూడా పెరుగుతుంది. తగ్గితే బలహీనపడుతుంది. అయితే ఈ హుద్‌హుద్ తీరం దాటడానికి ముందు ఉష్ణోగ్రతల్లో వైవిధ్యం ఉన్నట్టు వాతావరణ నిపుణులు గుర్తించారు. వాస్తవానికి మామూలు రోజుల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తుపాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు అంటే అక్టోబర్ 9న విశాఖలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విభాగం అధికారుల పరిశీలనలో సముద్ర ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలకు పెరిగినట్టు నిర్ధారించారు. ఐదుగురు శాస్త్రవేత్తలు, మరో ఐదుగురు విద్యార్థుల బృందం తుపాను తీరం దాటిన ఐదు రోజుల తర్వాత (అక్టోబర్ 17న) విశాఖపట్నం (కోస్టల్ బ్యాటరీ), తుపాను తీరం దాటిన ప్రాంతంగా భావిస్తున్న పూడిమడక సమీపంలోని అచ్యుతాపురంల నుంచి సముద్రంలోకి 30 కిలోమీటర్ల దూరం బోటులో వెళ్లారు.
ఆ సమయంలో ఉష్ణోగ్రతలు, లవణ సాంద్రత, ఆక్సిజన్ వంటివి పరిశీలించారు. అప్పట్లో సముద్ర ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీలు ఉన్నట్టు అంచనాకొచ్చారు. అక్టోబర్ 9-12 తేదీల మధ్య సైక్లోన్ ట్రాక్ వెంబడి సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీల తక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అంటే మధ్య బంగాళాఖాతం నుంచి విశాఖ తీరం వరకూ (ట్రాక్ మార్గం) సముద్రజలాలు చల్లగా ఉన్నట్టు గుర్తించారు. పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలను బట్టి హుద్‌హుద్ తుపాను తీవ్ర రూపం దాల్చినా, సైక్లోన్ ట్రాక్ వెంబడి ఉష్ణోగ్రతల తగ్గుదల వల్ల బలహీనపడాలని పేర్కొంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా సైక్లోన్ ఎందుకు బీభత్సం సృష్టిం చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.
నివేదికను గోవాలోని తమ హెడ్‌క్వార్టర్‌కు పంపుతామని విశాఖ ఎన్ఐవో సైంటిస్ట్ ఇన్చార్జి డాక్టర్ వి.ఎస్.ఎన్.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడ సమగ్ర పరిశోధన జరిగాక స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తీరం దాటే సమయంలో ఉష్ణోగ్రతలు, సైక్లోన్ ట్రాక్‌లో పరిస్థితిపై పరిశోధిస్తున్నారు. దీంతో పెద్ద, చిన్న తుపాన్లు వచ్చినప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో, ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోగలుగుతారు.